ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, January 18, 2018

పల్లెకాంతి... సాహితీ సంక్రాంతి
అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పండుగ వైభవ ప్రాభవాలన్నీ పల్లెల్లోనే వెల్లివిరుస్తాయి. గ్రామ జీవన ఆత్మీయ మానవీయ బంధాలన్నింటినీ దృశ్యమానం చేసే కనుల పండుగ మనసు నిండుగ సంక్రాంతి పండుగ. ఆరుగాలం శ్రమిస్తూ భూమిని నమ్ముకుని ఉన్న నేలకే బ్రతుకు ముడుపు గట్టిన రైతులకు పంటలు చేతికొచ్చే కాలం. కనుకనే ధాన్యలక్ష్మి రూపేణా నట్టింటికి నడిచొచ్చే సౌభాగ్యలక్ష్మి ఆ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ జరుపుకునే సంబురమే నిజానికి సంక్రాంతి. అందుకే అచ్చమైన జానపదుల వేడుకగా, పల్లీయుల ఉల్లాలను రంజిల్లచేసే పండుగగా సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అనే వ్యవహారం కూడా ఉంది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్’ అని సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ముదిమి వయసు మీరిన వారయినా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కాలధర్మం చెందినా పుణ్యలోక ప్రాప్తి సంభవిస్తుందని సంభావిస్తారు. సంక్రాంతి రోజు పితరులకు తర్పణాలు వదలడం కూడా ఉంది. అంతేకాదు వ్యవసాయాధారిత జీవనులు పంటలు పండేందుకు తమకు తోడై బ్రతుకుతున్న పాలేళ్లు, జీతగాళ్లకు కూడా తమ ధనధాన్యాల నుండి, ఆర్జించిన ధనం నుండి, వస్తూత్పత్తి నుండి దానం చేయడం - కుటుంబంలో ఒకరిగా సమిష్టి జీవన ఆత్మీయబంధాన్ని ప్రకటిస్తారు.

‘లా కేత్వమీయ నేరరు’ అన్నట్లు లేదనకుండా తమ శక్తిమేరకు ఇలా దానశీలతను, ఔదార్యాన్నీ వెలారుస్తారు. కనుకనే సంక్రాంతి రోజులైన ధనుర్మాసమంతా హరిదాసులు, జంగమదేవరులు, బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వారు, ఒగ్గు కథకులు, విప్రవినోదులు, పగటి వేషగాళ్లు ఒకరేమిటి ఎందరెందరో సంచార జీవనులు, కళాకారులు వచ్చి గృహస్థుల నుండి తృణమో పణమో పొంది ఆనందంగా ఆశీర్వదించి వెడుతూంటారు.
పల్లె శోభాయమానంగా ప్రకృతి అందాలతో కానవచ్చే కాలం సంక్రాంతి.

కొసరి నూరిన పచ్చి పసుపు పుంత మొగాన
గుమ్మడి పూ దుమారమ్ము నద్ది
కండరేగడి నార పండి కన్పండువై
పొలయు మిర్యపు పండు బొట్టు పెట్టి
వలిపమ్ము నొకనొక్క వాసి హెచ్చినట్టి
నుసమంచు తెలిచీర నూలుగొల్పి
బంతిపువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి
కబరీ భరమ్ము చక్కన గుదిర్చి
పంట కళ్లాల మున్ బరాబరులు సేయ
గూడు గట్టిన తెలిమబ్బు గొడుగు నీడ
కదలివచ్చెను భాగ్యాల కడలివోలె
మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి
అంటారు కవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తిగారు.

శుభ సంక్రాంతి నవోదయ వేళ ఆ చిరుచలి నవ యువతనే కాదు ముసలి జంటలనయినా ‘ఏకాకీ న రమేత’ అనిపిస్తుందంటాడు దాశరథి.

మంటలు వేసిన యంతనె
మన చలి పరుగెత్తేనా
జంటలలో దొరుకు వేడి
మంటలలో లేదోరుూ! 
అంటాడు ‘సంక్రాంతి రాత్రి’లో.

మంచు ముసుగు వేసి పొంచి చూచెడి తూర్పు
పడతి మొగము నుండి పొడచినాడు
బాలభాస్కరుండు, పచ్చని సంక్రాంతి
శుభ ముహూర్తము నందు, నభము నందు

కొద్దిగా గిలిగింతలు గొలుపు చలినె
పులకరింపగ జేసెడి ప్రొద్దు పొడుపు
ఉల్లమున మల్లెపువ్వులు చల్లునపుడె
కొసరి గోరింట ముళ్లను గ్రుచ్చసాగె

అంత చలిలోనూ ఈ రోజుల్లో ముంగిట ముగ్గులు ముదితలు వేస్తూంటారు. భోగిమంటలు మాలిన్యాలను క్షాళన చేస్తూంటాయి.

ఒక్కవైపు జాలి, ఒకవైపు చలిగాలి
ఒకవైపు మ్రుగ్గు, ఒకట సిగ్గు
నాల్గువైపులందు నాల్గు నిర్బంధాలు
కదలలేక వెలది కంపమందె
శుభ సంక్రాంతి నవోదయ
ముభయుల హృదయాల వెల్గుటుయ్యెల లూపెన్
నభము, ధరతాల మొకటై
అభయమ్మిడె నుభయులకు మహానందముగా

అంటూ జంటలు కనుల పండుగగా, మంగళకరముగా, మహదానంద సుందరంగా దరిచేరే వలపు పంటల కాలం కూడా సంక్రాంతి అంటాడు దాశరథి.
పంట ఇంట నుండు పబ్బంబునాటికి, పిండివంట కొరకు చింతలేదు కనుకనే కొత్త అల్లుళ్లకు అత్తింటి మర్యాదల మహద్వైభవ కాలమూ ఇదే. పట్నం ఉద్యోగమే కాదు, అమెరికా ఉద్యోగం అయినా సంక్రాంతి పండుగకు సౌంత పల్లెకు చేరాలనే ఆరాటం. అందుకే నేటికీ తెలుగువారి జీవితాలలో తరగలెత్తుతూనే ఉంటోంది.
పైడి పంటలతోడ ప్రభవించె భూమాత
పాడిపంటల తోడ భాసిల్లె గోమాత
అత్తవారింట అర్ధాంగి వలపు పంట
విందులతోడ ఆనందించె జామాత

పరికిణీ పాదాలపైన చిందులు త్రొక్క
అక్క వేసిన మ్రొగ్గు త్రొక్కకుండగ నడిచి
హరిదాసు తల మీది అక్షయపాత్రలో
దోసెడు బియ్యమ్ము పోసె ముద్దుల చెల్లి

ఎండనక వాననక ఏడాది కష్టపడి
పండించుకున్న క్రొంబసిడి ధాన్యపురాశి
పంటకళ్లము నుండి ఇంట చేరినదన్న
సంతృప్తి మెరసె కర్షకుల కన్గొనలందు

-అన్న కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సమానత్వానికీ, సామ్యవాదానికీ ప్రజాస్వామ్య జీవన సంవిధానానికీ బొమ్మలకొలువు ప్రతీకాత్మక సందేశంలా సాక్షాత్కరింపజేశారు.

పులిప్రక్క మేక, ఏన్గుల మధ్య కుందేలు
పూరిల్లు - మేడ, మోటారు - ఎద్దులబండి
రాజు - బంటును, సామరస్యంబు సమకూర్చ
కనులవిందయ్యె సంక్రాంతి బొమ్మల కొలువు

-అంటూ స్వర్ణక్రాంతిని పొడగట్టించారు.

సంక్రాంతి పల్లె శోభను డా.సి.నారాయణరెడ్డి తమ కావ్యంలోని ‘హేమంత ఖండం’లో స్వీయ జీవన ఘటనలతో అనుభూతి రమ్యం చేస్తారు. సంక్రాంతి రోజుల ప్రకృతి శోభను ప్రస్తావిస్తూ

జనపద రంగమ్ములందు
సస్యరమణి ఆకుపచ్చ
చేలమ్ముల బదులు పసుపు
చీరలు ధరియింపసాగె

పెరడులోను తీగనిండ విరిసిన గుమ్మడిపూవులు
కన్పించెను క్షేత్రలక్ష్మికై బంగరు గిన్నెలవలె
అచ్చటచ్చట పండిపోయినట్టి మిరప పండ్లు కనం
బడెను నీరు దిగని మేలి పగడమ్ము గుత్తులట్లు

పొంగారిన ముద్దబంతి పూలనుగన తోచెనాకు
మించుభయముతో రూపము మార్చుకున్న తామరలని
కోతలన్ని ముగిసెను, వరికుప్పల నూర్పిళ్లయ్యెను
కాపుల కాపురములు సంక్రాంతికి శిబిరములయ్యెను

నేడే సంక్రాంతి ఊరివాడలన్ని గంగిరెద్దుల
కొమరాడెడు చిందులతో ‘కూచిపూడు’లై పోయెను 
అంటారు.

ఆబాలగోపాలం ఆనందంగా పరవళించే పర్వం సంక్రాంతి. పల్లెల్లో తెలుగు లోగిళ్లు రంగవల్లులతో మెరిసిపోతూంటాయి, తెలతెల వారకముందే భోగిమంటల కోలాహలం. పండుగ పూటా అభ్యంగన స్నానాలు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసే వేడుక. అలాగే భోగిరోజు కొత్తగాజులు వేయించుకోవడం, గాజుల వ్యాపారికి కొత్తవడ్లను ఇవ్వడం ఒక ఆచారం. సంక్రాంతి బొమ్మల కొలువులు, పేరంటాలు, బియ్యం పప్పులు, కూరలు నిండిన అయిదు మట్టి కుండలపై మూతలు పెట్టి నువ్వు ఉండలుంచి పరిచితులకు పంచిపెట్టడం కొన్నిచోట్ల ఆచారం. అయితే, ఒడిబియ్యం పెట్టడం మరికొన్ని చోట్ల ఆచారం. సంక్రాంతి రోజుల్లో తిలాదానం విశిష్టమని భావిస్తారు. అలాగే పెరుగును దానం చేయడమూ దధివ్రతం పేర మహాభారత కాలం నాటి నుంచీ వుందట. అలాగే తమ జీవనానికి నోరు, వాయి లేకపోయినా శ్రమించి సహకరించే పశువులను కొలవడం కూడా మూడు రోజుల పండుగ చివరి రోజు కనుమ పండుగగా ప్రసిద్ధం. వ్యవసాయ పరికరాలను కూడా ఈ సందర్భంగా పూజించడమనే ఆనవాయితీ ఉంది. పొలాల్లో పొంగళ్లు, కోడిపందేలు, ఎద్దుల ఊరేగింపులు, గ్రామదేవతకు నైవేద్యాలు పశువుల పండుగ సందర్భంగా రివాజయిన సంబురాల సంక్రాంతి కాంతియే!

అనేక వృత్తుల వారు, జానపద కళాకారులు కనువిందు చేసే గ్రామీణ వైభవం పల్లెల్లో సంక్రాంతినాడే సాక్షాత్కరిస్తుంది. జంగమదేవర, సాతానిజియ్యరు, గంగిరెద్దుల వారు, మాసాబత్తినివారు, నూనెగుడ్డలవారు, కాటికాపర్లు, కొమ్మదాసర్లు, తత్త్వాలుపాడే బైరాగులు, గోసాయిలు, దీవెనలు ఇచ్చే పకీర్లు, పిట్టలదొరలు, చెంచుదొరలు ఇలా సంక్రాంతి వేళ పల్లెలు జన జీవన వైవిధ్యాన్నంతా రాశిపోయే కాలం. కమ్మరి, కుమ్మరి వంట వృత్తుల వారికి ఆత్మీయంగా మిరిసి చెల్లింపులు ఇచ్చుకునే కాలం కూడా ఇదే. సంక్రాంతినాటి పల్లీయ ప్రకృతిని పింగళి కాటూరి, దువ్వూరి, కవికొండల, బాపిరాజు, తుమ్మల వంటి కవులు తమ రచనలలో దృశ్యమానం చేశారు. పల్లెల నుండి పట్నాలకు వలసపోయే దౌర్భాగం ఎవరికీ దాపరించకూడదనే ఆర్తి ఒకప్పుడు మిళితంగా ఉండేది. కొనకళ్ల వెంకటరత్నం ‘బంగారి మామ పాటల’ నాటికీ ఆ స్థితిని చిత్రించాడు.

ఈన మోపై వున్న పైరులు
ఏటి మునకల పాలుజేసి
కొంపగోడూ విడిచి పట్టెడు
కూటికై ఊరేగవలెరా

ఒళ్లు పెంచిన గడ్డమీదే
ఒరిగిపొయ్యే రాతలేదో
ఊరుగానీ ఊరిలో చితి
పేర్చుకొమ్మని నొసటి వ్రాలో
అన్న అర్తి గీతం రాశాడు. పల్లె సంక్రాంతి వైభవాలు మందగించి సామ్రాజ్యవాదపు పల్లకీ బోయీలమవుతున్న విషాదం ఏనాడో గుర్తించినట్లుగా రెంటాల గోపాలకృష్ణ ‘పల్లకీ బోయీల పాట’లో చీకటి తప్పు చేయడానికి పొరుగూరు వెడుతున్న పెద్దమనిషి పల్లకీని మోసే బోయీల విషాద గీతిక రాశాడు.

రాళ్లైనా మోయచ్చు
రథమైనా లాగచ్చు
గుండెలేనీ మనిషి
కూర్చున్న పల్లాకి
రంపాలతో కోసి
నట్టూగ ఉండాది’
(సర్పయాగం కవితాసంపుటిలోని ‘పల్లకీ బోయీలు’ కవితలో)

ఎంత ఆధునికతను సంతరించుకున్నా, సాంకేతికాభివృద్ధి జరిగినా మానవ జీవనంలోని మధుర పార్శ్వాలను కోల్పోకూడదు. స్టీవ్‌జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’ చదివే పరిజ్ఞానం లేకున్న తెలుగు పడతిచుక్కల ముగ్గులతో చక్కని చక్కగా గీతలను కలుపుతూ ఇంటి ముంగిలినే కాదు అంతర్జాల వేదికనయినా కళాత్మకం చేస్తూనే ఉంది.
ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి
గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి
ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి
పగడాలు చెడగొట్టి పట్టిలేయించి
అంటూ ముగ్గుల ప్రాధాన్యపు మురిపాల పల్లె గీతాలు బతికే వున్నాయి. సంతోషం, సంబరం, సుహృద్భావం, స్వాగతం, సమిష్టి జీవనం ఈ విలువలన్నింటికీ ప్రతీక సంక్రాంతి పర్వం.

సంకురాత్రి పండుగొచ్చె సిద్ధేశ్వరా
తల్లిపిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
సాంబమూర్తి కరుణకల్గి సిద్ధేశ్వరా
కలకాలం వర్థిల్లు సిద్ధేశ్వరా
ఏడాదికొక్కసారి సిద్ధేశ్వరా
వాడావాడ కొత్త నుండి సిద్ధేశ్వరా
అంటూ శంఖం ఊదుతూ గంటవాయిస్తూ ఒకనాడు సంక్రాంతి వేళ కనబడే జంగమదేవర యే కాదు, ఇవాళ అనేక సంచార జీవన కృత్తులవారు మాత్రమేనా కులవృత్తుల వారూ స్థానచలనమో, స్థానభ్రంశమో చెందుతూనే ఉన్నారు. పల్లెలే ప్రకృతికి పట్టుగొమ్మలై, శాంతి, సౌఖ్యాలతో పచ్చదనపు పరిశుభ్రాలతో విరాజిల్లే స్థితి ‘నగరీకరణం’ పేర క్రమేపీ మటుమాయమయ్యే దౌర్భాగ్యం ఆవరించకుండా మన సహజ సంపదలను, మానవ వనరులను, మనుషుల మధ్య ప్రేమాభిమానాలను, ఆత్మీయతలను ,మానవీయతను పరిరక్షించుకోవలసింది మనమే. పండుగలను దండగలనుకోకుండా ,మన ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను, మహోన్నత మానవీయ విలువలను నిలుపుకొని మనగలగడం మన చేతుల్లోనే ఉంది.
పోయిన సంక్రాంతినాడు
పొగ చూరిన ఇల్లు నేడు
కాంతి స్నానమ్ములాడె
కాలమెంత విలువైనది (ఋతుచక్రం- సినారె)

అని భవిష్యద్గానం చేసుకునే బంగరు సంక్రాంతులే మున్ముందు నిగ్గులు చిలికేలా తెలుగు వెలుగులు తేజరిల్లేలా ముందడుగు వేద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. *

-సుధామ


                                                           ఆదివారం 14 జనవరి '2018

Monday, January 8, 2018

మధ్యతరగతి జీవన విలువల అస్తిత్వ కథా విహారిS ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన అన్నట్లు, ‘కథకులందు పుణ్యకథకులు వేరయా’ అనాలనిపిస్తుంది ‘మనవే’ అనిపించే విహారి కథలు చదివినప్పుడు. మానవీయ విలువల మహిత సంపదను మూటగట్టిన నిధులు వారి కథలు. విహారి కథల్లో -
విలక్షణత వుంది,
హాయిగా చదివించే పఠనీయత వుంది,
రిరంసవాటిల్లోది ప్రధానంగా జీవన మూల్యాలది.

రెండు ఏడుల వయసులో అడుగిడిన విహారి అర్ధశతాబ్దంపైగా కథారచనా విహారం చేస్తున్నారు. బ్రతుకు తాత్త్వికతనే జీవనాడిగా చేసుకున్న ఆయన కలం మనిషి ‘చలనం’ను ‘స్పృహ’లో ఉంచుకుని, జీవితపు ‘ఎత్తుపల్లాలు’ ‘సహజాతాలు’గా చిత్రించింది. కథారచనా వైశిష్ట్యంలో ఆయనను ఒక ‘శిఖరంమీద’ నిలబెట్టింది. ఆయన ‘అక్షరం’, అభివ్యక్తి ‘వలయం’ పాఠకుడు ఇది విహారి రచన అని ‘పోల్చుకోగల రాతే’.
యాభై ఏళ్ళ కథారచనా ప్రయాణంలోని పాతిక ప్రాతినిధ్య కథలతో నవచేతన ప్రచురణగా విడుదల చేసిన విహారి కథలు చదువుతూంటే ఈ విలక్షణ పుణ్య కథకునికి దక్కవలసిన విశిష్ట గౌరవం ఇంకా సశేషంగానే ఉందనిపిస్తుంది. 

ఇప్పటికి పధ్నాలుగు కథా సంపుటాలు విహారివి వెలువడ్డాయి. స్పృహ, గోరంత దీపం, అక్షరం, అమ్మ పేరు చీకటి, గుండెలో కోయిల, బొంగరం, కొత్తనీరు, ప్రాప్తం, చిరంజీవి ఆశ, వౌనలిపి, ‘వి’గతం, కిటికీ తెరిస్తే, మాయతెర, విహారి కథలు అనే ఈ కథానికల సంపుటులలోని కథలన్నీ క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులవలె పరివర్తనాశీలమైన మానవ జీవన వైఖరులకు ప్రతిబింబితాలుగా వున్నాయి. ఇంత విస్తృతితో, విలక్షణతతో, వైవిధ్యంతో కథలు రాసినవారు అరుదు. రాసిన ప్రతి కథా నాటి సమకాలీనతను సంతరించుకోవడం మాత్రమే కాక ఒక సార్వజనీనతా లక్షణాన్ని కూడా పొదుపుకోవడం విశేషం. విహారి కథలు పాఠకులను ఊహాల్లోకాల్లో తేలియాడించవు. భ్రమలలోకి నెట్టవు. అవాస్తవికతను ఆపాదించవు. జీవితం ఏది ఎప్పుడు ఇస్తుందో అప్పుడు దానిని స్వీకరించడమనే నేల విడచి సాము చేయని జీవన పథాన్ని నిర్దేశించి ముందుకు నడిపిస్తాయి. హేతువును, తార్కికతను విస్మరించకుండానే సమ్యక్ దృష్టిని కలిగించే స్థితప్రజ్ఞతవైపు పఠితను మేల్కొల్పుతాయి. ఆయన రచనా శైలి గొప్పది. భాషపట్ల మంచి పట్టుంది. వ్యక్తులను, సమాజాన్నీ నిశితంగా పరిశీలించడంలో నిష్ణాతులు. అందుకే ఆయన కథల్లోని సంఘటనలు గానీ, పాత్రలుగానీ, ఆ పాత్రల సంభాషణలు గానీ ఏవీ కృతకంగా వుండవు. సహజత్వం తొణికిసలాడుతూంటుంది. ఆయన కథల్లో ప్రయోగాలు ఎన్ని చేసినా అవి చెప్పదలుచుకున్న విషయానికి ప్రోద్బలంగానూ, పాఠకానుభవానికి సహాయకారిగానూ వుంటాయి తప్పితే ప్రయోగం కోసం ప్రయోగం అన్నట్లుండవు.

విహారి కథల్లోని మరో గుర్తించదగిన కోణం ఏమిటంటే ఆయన కథలు ‘మధ్యతరగతి’ వర్గ సమాజానికి చెందినవి. ‘‘అందరూ ఆడిపోసుకునే మధ్య తరగతి మందహాసాల వెనుక దాగిన సింబల్స్‌ని, ప్రతీకలని ఔపోసన పట్టిన కథకుడు విహారి’’ అని మునిపల్లె రాజుగారన్నా, ‘‘మధ్యతరగతిని ఒక ఇంటిపేరుగా తీసుకుని తెలుగు సమాజానికి కొత్తగా పరిచయం చేస్తారు విహారి. అవసరానికి ఆదుకునే బంధువులు, ఇంటిమొత్తానికి ఒకడే సంపాదనాపరుడిగా ఉండటం, ఆచారాలు- సంప్రదాయాల పేరిట ఆదాయాన్ని మించి ఖర్చులు పెట్టడం, అనవసర ఆర్భాటాల మధ్య జీవితాన్ని సంక్షుభితం చేసుకోవడం, తమ గురించి కాక, తమ చుట్టూ వున్న సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో బతకడం లాంటి లక్షణాలు ఈ మధ్యతరగతికి అంటుకున్న ప్రవర. ఈ దశనుంచే విహారి ఇరవై ఒకటి శతాబ్దపు కొత్త వాకిలిని పరిచయం చేస్తాడు’’ అని నండూరి రాజగోపాల్ వి
శ్లేషించినా అది యథార్థం.

‘మాయతెర’ కథనానికి సంపుటికి ‘అంతరంగ నాదం’ అని తన మాట రాస్తూ ‘‘అనివార్య పరిస్థితులు నెట్టుకుపోతే ఆ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి, పోరులో, పోరుతో సతమతమై, కడకు సమసిపోతున్న త్రిశంకు వర్గం కథానికలు ఇవన్నీ. నేను రాసే కథానికల్లో ఎప్పుడూ ఎక్కువ భాగం ఈ వర్గానికి చెందినవే. ఆ వర్గంవారి పాత్ర పోషణలో మనస్తత్వ విశే్లషణకి నా నేర్చినంత ప్రాధాన్యతనిస్తాను. నా కథానికలు సమయాన్నీ సందర్భాన్నీ, నిర్మాణాన్నీ వాటికవే కూర్చుకుంటాయి. నా కథల్లో నేను మధ్యతరగతి బతుకుపోరులో మందహాసాల మాటున ఉబికే మూగ సంవేదనల్ని వ్యక్తావ్యక్తంగా పాఠకుల ముందుంచుతాను. వ్యక్తంనుండి అవ్యక్తం అందుకోవడమే రసోల్లాసం అని ఆనాటి లాక్షణికులు అన్నారు. దానే్న సాహిత్యంలో అనిర్వచనీయత అని నేను నా వివిధ వ్యాసాల్లో సోదాహరణంగా ప్రతిపాదిస్తూ ఉన్నాను. అదే సాహిత్యంలో జీవిత సౌందర్యము. జీవన తాత్త్వికత కూడా. సాహిత్యం చేసే అసలైన మేలు వీటిని గ్రహించగలగడమే!’’ అని పేర్కొన్నారు స్వయంగా. అందుకే విహారి కథలు కాలంతో నడుస్తూ, కాలంతో నిలుస్తూ, కాలంతో గెలుస్తూ పాఠకులను అలరిస్తూన్నాయి. ఆయన విరామ రచయిత కాకుండా, నిర్విరామ కథకునిగా రాణించగలుగుతున్నారు.

ప్రముఖ కథా రచయిత బుచ్చిబాబు గారు కూడా EXISTENTIALISM అంటే అస్తిత్వవాదానికి ప్రాధాన్యత ఇచ్చినవారే. మధ్యతరగతికి మనశ్శాంతినిచ్చే మహామంత్రం అదే అనిపిస్తారు విహారి గారు కూడా. ‘స్పృహ’ అన్న ఆ జీవన తాత్త్వికతనే చిత్రించారు. నాలుగంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో వుండే ఆఫీసులో పనిచేసే రెడ్డిగారు భవనం మొత్తం కుప్పకూలి వందల సంఖ్యలో జనం చచ్చిపోయినా బ్రతికి బట్టకడతారు. నోట్లో వెండి చెంచాతో పుట్టిన ఆయన జీవితం తిరిగిన మలుపులు, పక్షవాతపు భార్య, నోరూ కాలూ లేని కొడుకు వున్నా ఆయన అస్తిత్వం వదులుకోలేదు. తరుగులోనే మెరుగు ఉంటుంది బతుకులో. ‘‘జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు. అది రాలేదని బాధపడీ, ఇది కావాలని ఆరాటపడీ మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం’’ అన్న రెడ్డిగారి మాటే విహారిగారి బతుకు ఫిలాసఫీ! మానవ అస్తిత్వానికి నిర్ణీత లక్ష్యమేమీ లేదని ఈ జీవితానికి విలువ, అర్థం మనం ఇచ్చుకునేవేనని బోధించే తత్త్వధోరణే అస్తిత్వవాదం. జీన్‌పాల్ సార్త్రే సిద్ధాంతమూ ఇదే!

‘చలనం’ కథలోని శ్రీనివాస్ ఒకచోట అంటాడు- ‘‘దౌర్భాగ్యాలు రెండు రకాలు. ఒకటి ఎవర్నీ నమ్మలేకపోవడం. రెండవది అందర్నీ నమ్మడం. అసలు జీవితం నటన, ఆత్మవంచన, కపట నాటకం కాదంటావా? హృదయం ఏదో కావాలని తహతహలాడుతుంది. శరీరం దేన్నో పొందాలని వాంఛిస్తూ వుంటుంది. అది అందదనీ, దీన్ని పొందలేమనీ తెలుసు. అయినా ఏదో తపన. ఆ అగ్ని చల్లారదు. ఈ కాంక్ష చావదు. ఏమీ చెయ్యలేము. అస్థిమితత్వం- అలసత్వం, ఆరాటం, అసహాయత, వీటన్నింటినీ ఛేదించుకుని బయటికి రాలేక, ఆశలు ఆశయాల పరిధిమీద ఒకే బిందువును పదే పదే పాదాలతో చుంబిస్తూ ఒకటే పరుగు. చివరికి భయంకరమైన యాతనాభారంతో మనిషి చీకటి కోణంలో కూరుకుపోతూనే వున్నాడు’’. మధ్యతరగతి జీవి ప్రధానంగా లోనయ్యే జీవన స్థితి అదే'Man is a useless passion' అనేది చలనంలోని సంచలనం!

అయితే కథల్లో నైరాశ్యము, పలాయనము వుంటాయనుకోవడం సరికాదు. అనవసరపు ఆర్భాటాల నడుమ బ్రతుకు సంక్షుభితం కాకూడదనే హెచ్చరికనే అందిస్తారు విహారి. ఉదాసీనతకు ఉద్రేకానికీ కూడా సహజీవనం నేర్పి డబ్బు జబ్బులో పడకుండా విలువలకై నిలబడే దిశా నిర్దేశనం వారి కథల్లో సూచితాలు. పిల్లల స్వేచ్ఛను గౌరవించడం ‘కిటికీ తెరిస్తే’ కథలో వృద్ధతరానికీ సుబోధకం చేశారు.

సృజనశీలి అయిన కథకుడు స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట కూడా కాగలుగుతాడనిపిస్తుంది. ‘నీడ’ కథలో సమాజపు ఒక వౌలిక మార్పును ఆయన ఆనాడే పసిగట్టారు. ఉమ్మడి కుటుంబ జీవనాలు ఆర్థిక మూలాలపై ఎలా విచ్ఛిన్నమవుతూ వస్తాయో ఊహించారు. అలాగే తెలుగు సాహిత్యంలో స్ర్తివాదం అంకుర దశలో ఉన్నప్పుడే ‘నిప్పు’ కథ ద్వారా స్ర్తి సాధికారిక స్వరాన్ని తండ్రినయినా ధైర్యంగా ప్రశ్నించే తనయ వైఖరినీ చిత్రించారు. అలాగే సరళీకృత ఆర్థిక విధానాలంటూ ప్రవేశించిన తరుణంలో రైతు జీవనం ఎలా ఛిద్రమైందీ, ఒకప్పుడు భూమిని నమ్ముకుని దర్జాగా బతికిన బతుకులే అమ్ముకుని ఎలా వలస జీవాలై కూలీలుగా, రిక్షావాళ్ళుగా, బిచ్చగాళ్ళుగా మారుతూ వచ్చిందీ ‘భ్రష్టయోగి’ కథ చదివితే కరతలామలకమవుతుంది. ‘వాస్తవాన్ని నమ్మక తప్పదుగానీ, అది ఇంత కఠోరంగా, దారుణంగా వుంటే భరించడం కష్టం’ అనిపింపజేసే గుండెల్ని పిండే కథే అది. 
భూ’మధ్యరేఖ కథలోనూ ఈ స్థితినే చెప్పినా రైతు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రబోధిస్తూ ‘ప్రతి సమస్యకీ ప్రత్యామ్నాయం, పరిష్కారాలు వుండనే వుంటాయి’! అని ఆశావహ దృక్పథాన్నేఎగసన వేస్తారు. 

‘అడుగులో కాలేసినవాడు తీసుకోవడమూ, కాలు కడుక్కోవడమూ కూడా తానే నేర్చుకుంటాడు. మనిషికి చరిత్ర నేర్పుతున్న పాఠం ఇదేనమ్మా’ అని అస్తిత్వ వాదానికి ఊపిరులూదుతారు. ‘ఇల్లు ఒక చేదు మాత్ర’ వంటి కథ ద్వారా మంచివారిని మోసం చేసిన ఉసురు ఊరికే పోదన్న సంగతినే సంఘటనాత్మకంగా అనిపింపజేసేలా చిత్రిస్తారు. నడి సముద్రంలో ఎత్తయిన గిరిశిఖరం మీద వెలుగు కిరణంలా మానవత్వం భాసిస్తుందనే నమ్మికకు ప్రోదునిస్తుందీ కథ.

ఉత్తరాలు రాసుకునే కాలం పోయి ఉత్తగా సెల్‌ఫోన్‌లో మాటాడుకోవటాలూ, ఆ మాటాడుకోవడాలూ మాని ఎస్సెమ్మెస్‌లు ఇచ్చుకోవడం, ఛాటింగ్‌లు కాలం వచ్చింది. వాట్సప్‌లో మాటల టైపింగూ పోయి ఈమోజీలతో భావప్రకటనం చేసే వైఖరీ ప్రబలుతోంది. ఈ మార్పులు, సాంకేతికత కూడా అనివార్యాలే. ‘ఇల్లు చేదుమాత్ర’ కథానికలోని వస్తువునీ, శిల్పాన్నీ అభినందించిన పలు ప్రాంతాల పాఠకుల పేర్లనూ, సెల్‌నెంబర్లనీ కూడా విహారిగారు తమ కథానికా సంపుటి ‘మాయతెర’లో నమోదు చేయడం చూసినపుడు కాలావధుల్లో ఒదిగే ఆయన ఎలా కాలాతీత కథకునిగా సార్వజనీనం కాగలుగుతున్నారో కదా అని వందన సమర్పణ చేయాలనిపిస్తుంది.

ఏమయినా విహారి విలక్షణ హాయిని అందించే రిరంసా మానవీయ భావనల కథకుడు. పాఠక హృదయాలను అస్తిత్వ తాత్త్వికతతో రసప్లావితం చేసే పుణ్య కథకుడు. ‘మాయతెర’లను చీల్చి ‘గోరంతదీపం’ కాంతి ‘వలయం’లో బ్రతుకుకి అవసరమైన ‘చిరంజీవి ఆశ’ను ఆవాహన చేయించే సత్యనారాయణుడు. ఆ కథావిహారికి అభినందనల కైమోడ్పులు.
- సుధామ


Saturday, December 9, 2017

పదునైన వ్యంగ్య రచనలో రారాజు


కీ.శే.కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి అంటే ఎవరో అనుకోవచ్చు. కానీ పతంజలి అనగానే తెలుగు సాహిత్య లోకం కె.ఎన్.వై.పతంజలి అని సులభంగానే గుర్తిస్తుంది. ఎందుకంటే రాచపుట్టుక పుట్టిన ఆయన రచయితగా బడుగు ప్రజల పక్షం వహించి ‘రాజ్యం’లోని దుర్మార్గాలపై వ్యంగ్యపు పదునుతో కలాన్నే కత్తిచేసి దునుమాడినవాడు. 

నేటి విజయనగరం జిల్లాలో విలీనమైన నాటి విశాఖ జిల్లాలోని అలమండ గ్రామం ఆయన పుట్టిన ఊరు. 29 మార్చి 1952లో జన్మించి ఆ జనపదం నుంచే జ్ఞానపథం వైపు మరలాడు. ఆరు వందల సంవత్సరాల ఆలమండ అణువణువునూ తన పరిశీలనతో భద్రపరచుకున్న ఆయన బుద్ధి, హృదయం అందుకే తన రచనల్లో ప్రభావోపేతంగా ప్రతిఫలించాయి. చోడవరం, కొత్తవలసలలో విద్యాభ్యాసం చేసి, చిన్ననాటనే అపరాధ పరిశోధక నవలలు, ఇంట్లో వున్న ఇతరేతర పుస్తకాలు, ఆంధ్ర పత్రికలు చదివి నిరంతర పాఠకుడయ్యాడు. ఆ దశలోనే అన్నయ్య దగ్గర శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం, బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి అక్కడ చలం ‘స్ర్తి’ చదవడం పతంజలిలో మార్పునకు మూలధాతువులయ్యాయి. 

విజయనగరంలో డిగ్రీ చదువుతున్నప్పుడే అద్దె గదిలో పతంజలి అక్షర యాగానికి అంకురార్పణమైంది. పదకొండేళ్ల ప్రాయంలో రాసిన ‘అస్థిపంజరం’ డిటెక్టివ్ నవల అలా వుంచితే 1963 నుండి ఓ పుష్కర కాలం పొందిన అనుభవంతో, సామాజిక అవగాహనతో 1968లో ‘చివరి రాత్రి’ అనే కథానికతో మొదలుపెట్టి పలు కథలు రాశారు. చలంలా రావిశాస్ర్తీలా రాయడమనే ప్రేరణ ఆ దశలోనిది. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికలో 1975లో ఉపసంపాదకునిగా చేరడంతో తన జర్నలిస్టు వృత్తి జీవితం మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం తనలోని జ్ఞానాగ్నిని రగుల్కొల్పింది. ప్రాచ్య పాశ్చాత్య రచయితలను, వారి సాహిత్యాన్ని అవలోకనం చేశాడు. జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాలతో పెనవేసుకున్న ఆత్మిక భావన పతంజలిని విశ్వ మానవ సౌభ్రాతృత్వం వైపు మరల్చింది. తన ‘వీరబొబ్బిలి’ నవలను ‘డాగిష్ డాబ్లర్’గా తానే ఆంగ్లంలో అనువదించుకునేంత ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో మన్ననలు పొందగలిగాడాయన.

పతంజలి రచనలన్నీ త్రికరణ శుద్ధితో వెలువడినవే. మాటకు, రాతకు, చేతకు పొంతనలేని రచయితల కోవకు ఆయన చెందడు. మాట పడడం నచ్చనివాడు. తన రచనలు ప్రమోట్ చేసుకోవడం, పురస్కారాల వెంపర్లాట ఏ కోశానా లేనివాడు. మనుషులను ప్రేమించినవాడు. పత్రికా ప్రపంచంలో నిజాయితీ గల జర్నలిస్టు ఇమడగలగడం ఎంత కష్టమో తానెదుర్కొన్న ఇబ్బందులతో స్వయంగా గ్రహించిన వాడాయన. ‘పతంజలి పత్రిక’ అని విశాఖలో సొంతంగా దినపత్రిక పెట్టి చేతులు కాల్చుకున్నాడు కూడాను. ఆ తర్వాత వృత్తిపరంగా పతంజలి రూపెత్తిన సరికొత్త కేశ తైలాన్ని కనుగునే ఆయుర్వేద వైద్య ఫణితి, నిల్వ పచ్చళ్ల తయారీకి దిగి శ్రమ జీవనానికి ఆహ్వానం పలకడం కొందరికి అచ్చెరువును కలిగించాయి కూడాను. తండ్రి నుంచి ఆయుర్వేద వైద్యాన్ని వారసత్వంగా అందుకుని బతుకుతెరువు గడుపుకున్నాడు. 57 ఏళ్ల వయసులో 2009లో తనువు చాలించాడు.

పేరు కోసం కాక, తన రచనా ప్రవృత్తిని వ్యవస్థలోని చెడునీ దుర్మార్గాన్నీ వెక్కిరిస్తూ ప్రశ్నిస్తూ సాగించాడు. అన్యాయాన్ని రచ్చకీడ్చడమే తనకానందం. అందుకే పతంజలి కలం పదునైన వ్యంగ్యానికి ప్రతీకగా మారింది. ధర్మాగ్రహం, బాధలకు ప్రతిస్పందన తన వ్యంగ్యం. ‘అస్త్రాలు అనేవి ఉంటే పాశుపతాస్త్రం తీవ్రాతి తీవ్రం అని నేను విన్నాను. దానికన్నా తీవ్రమైన అస్త్రం వెక్కిరింత. అది నా జిల్లాలో, నా కుటుంబంలో చాలా ఎక్కువ బహుశా అది నా రక్తగతం’ అని స్వయంగా ప్రకటించుకున్న పతంజలి వైయక్తిక సంభాషణలు కూడా హాస్యస్ఫోరకంగా ఉండేవి. సునిశిత వాదన వ్యంగ్య వాగ్ధార తనది. లోకానుభవం మూలకందం. 

దిక్కుమాలిన కాలేజీ (1976), చూపున్న పాట (1998), అదర్రా బంటి (1984 ఉదయం పత్రిక సీరియల్. ప్రచురణ 2005), కథా సంపుటాలు, ఖాకీవనం, రాజుగోరు.. వారి వీర బొబ్బిలి, పెంపుడు జంతువులు, అప్పన్న సర్దార్, ఒక దెయ్యం ఆత్మకథ, గోపాత్రుడు, పిలక తిరుగుడుపువ్వు, నువ్వే కాదు లేదా మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు వంటి నవలలు నవలికలు 1970 లగాయితు ఓ మూడు దశాబ్దాలపాటు పాఠకులను పతంజలి విలక్షణ శైలితో విశేషంగా అలరించాయి. 1984 నుండి 1986 వరకు ‘ఉదయం’ దినపత్రికలో తాను కాలమ్‌గా రాసిన వ్యాసాల సంకలనం ‘పతంజలి భాష్యం’ (1989) అతని ఉన్నత శ్రేణి ఉదాత్త భావజాలాన్ని పరివ్యాప్తం చేసింది. ‘రచయిత కాలేని వాడు మంచి పాత్రికేయుడు కాలేడు. శ్రీశ్రీ, గోరాశాస్త్రి  మంచి రచయితలు, మంచి పాత్రికేయులు అయ్యారు’ అన్న పతంజలి తానూ ఏ పత్రికలో వున్నా తను రాసే సంపాదకీయాలతో ప్రజాదరణ పొందాడు. తెలుగు నాటక రంగం గురించిన ఓ సంపాదకీయంలో ‘ఒకే ఒక్క గొప్ప నాటకంతో బతికేస్తున్న జాతి బహుశా ఇదొక్కటే’ అంటూ కన్యాశుల్కం తరువాత జన జీవితంలో భాగమై ప్రభావం వేయగల నాటకం మరొకటి రాకపోవడాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.

పతంజలి రచనల్లో స్త్రీపాత్రల ప్రాముఖ్యత ఎందుకో తక్కువే! అయితే ఆయన ఇతివృత్తాల, రచనా సంవిధానాల పరిధిలోనే ఆ పాత్రలున్నాయి. స్ర్తివాదం మీద సానుకూల దృక్పథం గల పతంజలి ‘స్త్రీల బాధలు రచనల్లో ప్రతిఫలించాలి. స్త్రీలే ఆ విషయాలు మాట్లాడాలిస్త్రీలు మాత్రమే అవి రాయాలి’ అని స్త్రీవాదం ప్రబలంగా రావాలనే అభిలషించారు. తాను రాసిన కవిత్వం మాత్రం తక్కువే! 

వచన రచయితగానే పతంజలిది పదునైన కలం. రాయడం గొప్పతనంగా కాక బాధ్యతగా రాసిన రచయిత పతంజలి. రష్యన్ వచన మహా రచయితల్ని అతను జీర్ణం చేసుకున్నట్లుగా మరెవరూ చేసుకోలేదేమోనన్న కె.శివారెడ్డి మాట సత్యదూరం కాదు. పత్రికా రచనలో తెగువ, మెలకువ కలిగి కథా రచన నుండి నవలా రచయితగా పరిపక్వమైన ప్రతిభామతి కె.ఎన్.వై.పతంజలి గురించి కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ సాహిత్య నిర్మాతలు పరంపరతో గ్రంథాన్ని వెలువరింపజేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం. ఉత్తరాంధ్ర జీవద్భాషతో తెలుగు కథా రచన చేస్తూ, వికర్ణ అదిగో ద్వారక వంటి పురాణ పునర్మూల్యాంకన రచనలతో సమాజాన్ని వివేచింపజేస్తూ వున్న ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు గారి చేత ఈ ‘మోనోగ్రాఫ్’ రాయించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది. పతంజలి వ్యక్తిత్వ, సాహిత్య విరాడ్రూపానికి చక్కటి ఫ్రేమ్ కట్టి అందించిన చిత్తరువు ఈ గ్రంథం.
-సుధామ


కె.ఎన్.వై.పతంజలి
-చింతకింది శ్రీనివాసరావు
సాహిత్య అకాడెమీ ప్రచురణ
ప్రధాన కార్యాలయం, రవీంద్రభవన్ 35, ఫిరోజ్‌షా రోడ్ న్యూఢిల్లీ - 110 001
వెల: రూ.50
** ** ** ** ** ** ******ఆంధ్రభూమి *దినపత్రిక*అక్షర*శనివారం*9.12.2017Wednesday, November 29, 2017

తెలంగాణ కథకులకు ‘కొండ’Oత అండ

‘నియంతృత్వ నిజాం పాలన’ అంటే ఇప్పటి ప్రభుత్వమూ, బేషరతుగా దాని వత్తాసు పలికే సాహిత్య కూటములూ ఒప్పుకోవేమో గానీ, పౌర స్వేచ్ఛ లేని పాలనగా భావించిన నాటి తెలుగు ప్రజలు - తెలుగు భాష ఉద్ధరణ కోసమూ, తెలుగు వారి సర్వాంగీతాభివృద్ధి కోసమూ తపించిపోయారు. తెలంగాణలో సాహితీ సాంస్కృతిక చైతన్యాన్ని ఉద్దీపింపజేయడంలో ‘గోలకొండ పత్రిక’ పాత్ర అవిస్మరణీయమైనది. నిజాం రాష్ట్రంలో తెలుగు వారిని ఏకతాటికి తేవడానికి, తెలుగేతరుల హేళనలను ఎదుర్కొని ఆంధ్ర మహాసభల నిర్మాణం చేసేందుకు సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదత్వంలో ‘గోలకొండ పత్రిక’ పోషించిన పాత్ర కీలకమైనది.

గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ‘ఆధునిక భాష కవిత్వ తత్వము’ అనే వ్యాసంలో శ్రీ ముడుంబ వెంకట రాఘవాచార్యులు గారు ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అని చేసిన వ్యాఖ్య, కురుంగంటి సీతారామాచార్యులు గారు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ పేర ఆధునిక సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో అసలు కవి పండితులే లేనట్లు తెలంగాణ సాహిత్యం పట్ల చూపిన ఉదాసీనత, నిరాదరణ సురవరం వారిని కలచివేసిన కారణంగానే ఆ విమర్శలకు సమాధానం అన్నట్లుగా 1934లోనే ‘గోలకొండ కవుల సంచిక’ను మూడు వందల యాభై నాలుగు మంది కవుల రచనలతో, జీవిత రేఖలతో వెలువరించారు. గోలకొండ పత్రిక చందాదారులకు ఒక్క రూపాయికి, ఇతరులకు రెండు రూపాయలకు ‘గోలుకొండ కవుల సంచిక’ అమ్మారు. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం 1935లో రాగా, అంతకు ముందే 1934లోనే తెలంగాణ అస్తిత్వ పతాకను ‘గోలుకొండ కవుల సంచిక’తో ఎగురవేసింది సురవరం ప్రతాపరెడ్డిగారే. 9.7.1934 గోలుకొండ పత్రిక సంపాదకీయంలో తాము వెలువరించిన సంచికపై వచ్చిన విమర్శలను కూడా తిప్పి కొడుతూ రాశారు. ‘మా తల్లిని మేము ప్రేమించిన నితర తల్లులను నసహ్యముతో చూచితిమని తగువు పడకూడదు’. ‘మా రాష్టమ్రుపై మా కభిమానముండిన మా కితరులపై ద్వేషమున్నదని వాదింపగూడదు’ ‘మీరు హైదరాబాదు భాషను వెక్కిరించుచున్నారు’ అంటూ ఆ సంపాదకీయంలో తెలంగాణ ప్రాంత అభిమానాన్ని నిర్ద్వంద్వంగా నిర్భయంగా ప్రత్యేక అస్తిత్వ భావనతో అభివ్యక్తీకరించారు.

గోలుకొండ పత్రిక 1926లో మే 10వ తేదీన మొదట అర్ధవార పత్రికగా బుధ, శనివారాల్లో వెలువడేది. 31.07.1933 నుండి సోమ, గురువారాల్లో వచ్చేది. 2.8.1937 నుండి జాతీయ పత్రికగా తనను తాను అభివర్ణించుకుంది. 1947లో దినపత్రికగా రూపుదాల్చింది. నిజానికి గోలకొండ పత్రిక వార్తాపత్రికే కానీ పద్యాలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, కథలు ప్రచురిస్తూ గోలకొండ పత్రిక నాటి తెలంగాణ సమాజంలో అపూర్వ సాహిత్యసేవ, భాషా సేవ చేసింది. జాతీయోద్యమాలన్నింటినీ నిలువరించింది. అనేక సంఘ సంస్కరణోద్యమాలకు బాసటగా నిలిచింది. ఎందరి చేతనో కలం పట్టి రచనలు చేసేలా చేసింది. తొలి దశలో సురవరం వారే పలు కలం పేర్లతో రచనలు చేసేవారు. పత్రికలో కథలను ప్రచురణకు ఆహ్వానిస్తూ 1926 మే 26 బుధవారం సంచికలో నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర సంఘం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావుగారు ప్రకటన ఇచ్చారు. అత్యుత్తమ కథలకు అయిదు రూపాయల బహుమానం ఇస్తామంటూ ‘బహుమాన కథ’ పేర ఆ ప్రకటన వచ్చింది. నియమాలు వివరిస్తూ మొదటగా నిజాం రాష్ట్రాంధ్రులలో కథలను వ్రాయు పద్ధతిని ప్రోత్సహించుటకై ఈ బహుమానము ఏర్పరుపబడినది అని పేర్కొన్నారు. కథ యొక్క విషయము (ప్లాట్), సాంఘికము (సోషల్), అయినను, చారిత్రకము (హిస్టారికల్) అయినను ఉండవలెను. నిజాం రాష్ట్రాంధ్ర దేశమునకు సంబంధించి యుండుట శ్రేష్ఠతరము. భాష సులభముగా నుండవలెను అని ప్రకటించారు.
1933 జులై 31 బుధవారం నుండి గోలుకొండ పత్రికలో సారస్వతానుబంధము వారమునకొక మారు నాలుగు పుటలు ప్రకటించడం కూడా జరిగింది. వాటిలో చిన్న కథలను వేశారు. 1934 నుండి ‘మా చిన్న కథ’ అంటూ ఓ శీర్షికన తెలంగాణలోని నాటి కథకుల కథలను ప్రత్యేకించి వెలుగులోకి తెచ్చిన ఘనతా ‘గోలుకొండ పత్రిక’దే!
గోలకొండ పత్రికలో 1926 నుంచి 1949 వరకు చాలా కథలే వచ్చాయి. కొన్ని కథలు ‘కథాంజలి’ శీర్షికనా ప్రకటితం అయ్యాయి. పాత గోలకొండ పత్రికలన్నీ ఈ కథల సేకరణ కోసం డిజిటల్ సంచికలన్నీ ప్రెస్ అకెడమీ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ నుంచి గాలించి యామిజాల ఆనంద్, డా.వి.వి.వెంకటరమణ మహోపకారం చేశారు. దాదాపు అలా సేకరించిన వంద కథల నుండి ‘గోలకొండ పత్రిక కథలు’ పేర యాభై రెండు కథలను నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించడం ఏటుకూరి ప్రసాద్ గారన్నట్లు ‘తెలంగాణ సాహిత్యం శిగలో మరో పువ్వు’.

ప్రముఖ పత్రికా రచయిత, విమర్శకులు కె.పి.అశోక్‌కుమార్ ‘పఠనాసక్తులను పెంచిన చిన్న కథలు’ అంటూ తమ ముందు మాటలో ఇందులోని కథలను విశే్లషించారు. ఈ కథల్లో ఎక్కువ శాతం హాస్య కథలు, ప్రేమ కథలు ఉన్నాయి. అధిక శాతం కథలు సాంఘికాలే! ఈ కథల్లోని భాష కొన్నింటిలో గ్రాంథికంగానూ, తతిమ్మావి పూర్తి వ్యావహారికంగానే వున్నాయి. నైజాం ప్రాంతపు కథకులే అయినా తెలుగు భాషను సంపద్వంతంగానే ప్రయుక్తం చేశారని గుర్తించాలి. ఉర్దూ పదాలు ఇక్కడి తెలుగులో ఎంత సహజంగా కలిసిపోయాయో కొన్ని కథల్లోని పాత్రల సంభాషణల్లో అందంగా ఒడిసి పట్టుకోవచ్చు. జాతీయోద్యమ స్ఫూర్తిగల ‘సుశీల’ (నెల్లుట్ల శేషగిరిరావు రచన), వెట్టిచాకిరికి బలి అయిన తల్లీకొడుకుల ‘రెండు శవాలు’ (ఉన్నవ వెంకటరామయ్య) కథ, జహంగీరు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో డబ్బు మదంతో వాగ్దానాలు మరిచి వ్యవహరించిన ఫర్ఖుందా వల్ల ఛిద్రమైన హమదాబేగం కుటుంబాన్ని ఆదుకున్న నవాబు ఔదార్యం తెలిపే ‘్ఫకీరు బిడ్డ’ (్భవకవి రామమ్మూర్తి) కథ, అలాగే పాశ్చాత్య వ్యామోహాన్నీ, ఆధునికత పేరిటి అవకతవకలనూ చూపుతూ ప్రబోధాత్మకంగా ముగిసే ‘బారిష్టరు గోపాల్ కిషన్‌రావు’ కథ, ‘ప్రణయబంధము’ (శేషాద్రి రమణ కవులు రాసినది) మేనరికం కాదన్నందుకు ఆ ప్రణయ జీవులు ఆత్మహత్య చేసుకోవడం చిత్రిస్తే ఆ తరహా ప్రేమ వృత్తాంతాలతోనే ‘వన భ్రాంతి’ ‘్భగ్న హృదయుడు’ ‘నిరీక్షణము’ ‘ఆనంద బాష్పములు’ వంటి కథలున్నాయి. (కటంగూరి నరసింహారెడ్డి, సారథి కె.పి.డబ్ల్యు.డి, సురవరం ప్రతాపరెడ్డి, ని.యె.యాదగిరిరావుల రచనలు). భావకవి రామమ్మూర్తి అనేది సురవరం వారి కలం పేరనీ అలాగే ‘గిరి’ పేర నందగిరి వెంకటరావు గారు కథలు రాశారనీ పీఠికాకర్త వివరించారు.

గోలకొండ పత్రికలో వచ్చిన వివిధ రచయితల ఈ కథాసంకలనంలోని కథలన్నీ గొప్పవి కాకపోవచ్చు. వెంటాడి, వెన్నడే స్మరణీయాలు కాకపోవచ్చు. కానీ మానవ మనస్తత్వ చిత్రణలతో, ఆనాటి సాంఘిక జీవన ప్రతిబింబాలుగా, నాటి కథకుల రచనా ధోరణులను తెలియపరిచేవిగా ఉన్నాయి. అప్పట్లోనే హరిజన వివక్ష గురించిన కథ రావడం ఒక విశేషం కాగా, హాస్య, వ్యంగ్యాలకు కథలలో నాటి నుంచే మంచి ప్రాతినిధ్యం ఉందని నిరూపించేవి కొన్ని.

ఏమయినా ఈ సేకరణ - కూర్పు నేటి ఒక చారిత్రక అవసరం కూడాను. తెలంగాణ ప్రాంతం నుంచి కథలు రాసిన కథకుల కథలను ఇలా గోలకొండ పత్రిక మూలకందంగా సంకలనం చేయడం, నవచేతన వాటిని ముద్రించడం ఆహ్వానించదగిన అంశాలు. ఈ సంకలనంలో అనుబంధంగా సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ కొంగు బంగారం - గోలకొండ పత్రిక’ అనే పరిశోధక వ్యాసాన్ని సంతరించడం ఔచితీమంతంగా భాసిస్తోంది.
‘మన రాష్టమ్రు నుండి తెనుగు దినపత్రిక నెలకొల్పుట ఎంత పవిత్ర కార్యమో అంతే కష్ట కార్యము’ అన్న సురవరం వారు నిజంగానే చీటికిమాటికి నిజాం ప్రభుత్వాధికారుల నుంచి బెదిరింపులు తట్టుకుని పత్రికను నిర్వహించారు. నిజాం ప్రభుత్వాన్ని ఎండగడుతూ సురవరం వారు ‘పిరికిపందలు’ అనే వ్యాసం రాయగా ఉపసంపాదకుని పొరపాటు వల్ల ‘పిరికి పందులు’ అని అచ్చుతప్పుతో అచ్చయ్యిందిట!
అసలే పందులు అనే పదం ఇస్లాం మతస్తులలో నాడు కోపం తెప్పించే అంశం. దీన్ని ఆసరాగా చేసుకుని కావాలనే ఆ పదాన్ని వాడారని చెబుతూ పత్రికను మూసేస్తామని అధికారులు బెదిరించారుట. జన్నరెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు నిజాం అండతోనే దోపిడీలను దౌర్జన్యాలను చేస్తూంటే నిర్ద్వంద్వంగా ఖండిస్తూ దేశ్‌ముఖ్‌ల పట్ల విముఖతతో సురవరం వారు వారి దౌర్జన్యాలను సహించేవారు కాదుట. సంగిసెట్టి శ్రీనివాస్ అనుబంధ వ్యాసంలో ఇలంటి ఆసక్తిదాయక అంశాలున్నాయి.

ఇంత మంచి కథలను, విశేషాలను పొదువుకున్న ఈ కథాసంకలనం పదిలపరచుకోదగిన రికార్డు గ్రంథం. ఆనంద్, రమణ, ప్రసాద్, అశోక్, శ్రీనివాస్ అందరూ బహుదా అభినందనీయులే.
-సుధామగోలకొండ పత్రిక కథలు-1 (కథాసంకలనం 1926-1935)
సేకరణ, కూర్పు: యామిజాల ఆనంద్, డా.వి.వి.వెంకటరమణ
వెల: రూ.190
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్ గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్) జి.ఎస్.ఐ. పోస్టుహైదరాబాద్-68.

                                  Andhrabhoomi : Daily :Akshara :25.11.2017: Saturday 

Saturday, November 18, 2017

తెలుగు కథల్లో ఆంగ్లంపై ‘వాత్సల్యం’ ఎందుకు?మేం గోదారోళ్లమండి’ అన్నట్లుగా, రాజమండ్రి మహిళా కళాశాలలో చదువుకున్న ‘మణి వడ్లమాని’ కౌటుంబిక జీవన స్థిరత్వం తరువాత ఓ ఏడేళ్ల క్రితమే రచనా వ్యాసంగానికి పూనినా, ఈ ఏడేళ్లలో నలభైకి పైగా కథలు రాసి, చేయి తిరిగిన రచయిత్రి స్థాయికి చేరుకున్నారు. ‘జీవితం ఓ ప్రవాహం’ అని ఓ నవల కూడా రాశారు. అంతర్జాలంలో తొలి కథ ‘కృష్ణం వందే జగద్గురుం’ కౌముది మాసపత్రికలో వెలుగు చూసింది లగాయితు, ఆవిడ కలం పరుగులెత్తింది. భర్త, పిల్లలు ప్రోత్సహించడంతో - మొదటిసారిగా ఇరవై నాలుగు కథలతో ఇప్పుడు వెలువడిన కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’.

అంతర్జాలంలోంచి అడుగుపెట్టినా, ఆపై అచ్చుగా అచ్చుపత్రికల వైపు మరలి, తెలుగు వెలుగు, స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, జాగృతి, చినుకు, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో పలు కథలు రాసి, కొన్నింటికి మంచి బహుమతులు కూడా సొంతం చేసుకున్నారు. 


సంకల్పాలు చెప్పుకుని బతికే సుబ్బుశాస్త్రి  హోరున కురిసే వాన కారణంగా ఆకలికి భార్య వర్థనమ్మతో బాటు అలమటించిన వేళ - ఆ బడుగు బాపన దంపతులను ఈశ్వర సంకల్పమే ఎలా ఆదుకుందో వివరించిన కథ సంపుటి శీర్షిక పేరిటి ‘వాత్సల్య గోదావరి’. అలాగే గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన జీళ్లు అమ్మే సూరిబాబు - జులాయితనం నుంచి మంచిని పంచే దిశగా మరలి, మానవత్వంతో పదిమందికి సాయం చేసే వానిగా ఎదిగిన కథనం ‘జీళ్ల సూరిబాబు’. మణిగారి కథల్లో ఇలా మనుషుల పట్ల సానుభూతినీ, ప్రేమనూ, కరుణనూ పరివ్యాప్తం చేసే ధోరణి పాత్రలూ, సంఘటనలూ ద్యోతకం అవుతూ, రచయిత్రి రచనా సంస్కారాన్ని చూపుతాయి. ‘మేనిక్విన్’ కథలో రాజయ్య చీరల షాపు షో కేసులో బొమ్మకు చీర కట్టేందుకు కూడా, నైతికతను ప్రదర్శించడం - ఉదాత్త విలువల పట్ల దృష్టిని ఉన్నతీకరించడమే! బొమ్మలోనైనా సరే స్త్రీల  మాన మర్యాదలకు విలువనివ్వడం నిజంగా విశేషం!

తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీరైనా తండ్రి టైలరింగ్ షాపులో పనిచేసేవారి ఉపాథి పోకూడదని, ఆ వృత్తిని కొనసాగించిన యువకుడు సునీల్ కథనం - ‘రెయిన్‌బో టైలర్స్’. వృద్ధులకు, అందునా మంచం పట్టిన వారికి అహరహం సేవలు చేయడం కష్టతరమైన అంశమే! కానీ నిస్సహాయ స్థితిలోని పెద్దావిడకి హృదయవాసిగా మారిన శోభ ఆదర్శనీయమైన సేవాతత్పరతా కథ ‘అనుబంధం’. వలసలు ఎక్కువైన నేటి కాలాన - మూలాలు వెదుక్కుంటూ, తాత అభీష్టం తీర్చడం కోసం స్వదేశానికి వచ్చి, అనుబంధాలు నిలుపుకునే వారధిగా మారిన ‘సోహం’ కథ కదిలిస్తుంది. పది మందికి ఉపయోగపడితేనే సంపాదించిన డబ్బుకి విలువ అని వేరుశనక్కాయలమ్ముకునే కుర్రాడి ద్వారా స్ఫూర్తి కలగడం - ‘అన్వేషి ’ కథలో చూస్తాం. అలాగే ‘కుటుంబ భారతం’, ‘సౌగంధికా లావణ్యం’ వంటి కథలలో చక్కని సంవిధానం చూపారు రచయిత్రి. 


అయితే ఒక్క విషయం-

మొబైల్ రింగ్ అవుతోంది. టీవీ చూస్తున్న చైతాలీ సౌండ్ తగ్గించి ఎవరి దగ్గర నుంచా అని చూసింది. అది సీమా నుండి వచ్చింది. వెంటనే ఆన్సర్ బటన్ ప్రెస్ చేసి ‘హాయ్ సీమా! గుడ్‌మార్నింగ్. పొద్దున్నేకాల్ చేసావు? ఏంటి విశేషం?’ అంది.


అవతల నుంచి సీమ ‘అరె చైతూ! అదే.. ఇవాళ మనకు లంచ్ పార్టీ ఉంది మర్చిపోలేదు కదా? అదీకాక డ్రెస్‌కోడ్ మారింది. అది చెబుదామని కాల్ చేశాను. నేను పెట్టిన మెసేజెస్ ఏవీ చూడలేదని అర్థమయ్యింది. మనం ముందు అనుకున్న యెల్లో బదులు లెమెన్ యెల్లో కలర్ శారీస్ కట్టుకుందామని డిసైడ్ అయ్యాము.’


కథారచన ఇలా - నేటి తరం ఇలానే మాట్లాడుతోంది కదా అని సమర్థించుకుందామన్నా, ఒక వాక్యంలో అన్నేసి  ఆంగ్ల పదాలతో రాయడం అనే ధోరణి ప్రశంసనీయం కాదు. ఇప్పటికే తెలుగు చచ్చిపోతోందన్న ఆర్తి ప్రబలుతున్నప్పుడు నిజానికి భాషను పరిరక్షించవలసిన కర్తవ్యం సాహిత్యకారుల మీద ఉంది. తెలుగు కథను తెలుగుతనంతో పరిపుష్టం చేయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది. పాత్రోచిత సంభాషణలు అనే మిష మీదనయినా ఆంగ్ల పద ప్రయోగం కొంత అర్థం చేసుకోవచ్చు గానీ, రచయిత్రే కథాసంవిధానంలో ఆంగ్ల పద ప్రయోగాల మోజులో పడకుండా ఉండడం అవసరం. 


మణి వడ్లమాని అన్ని కథలలో ఈ అనౌచిత్యానికి పాల్పడ్డారనడం లేదు గానీ, తెలుగు భాషకు, సంభాషణల్లో తెలుగు తనానికి మరింత ప్రాధాన్యం కల్పించి, తన కథల ద్వారా మానవీయ విలువలకూ, ఉదాత్త పాత్రలకూ, స్ఫూర్తిదాయక సంఘటనలకే కాక చక్కని తెలుగు నుడికారానికి, తెలుగు వాక్య నిర్మాణానికీ కూడా తోడ్పడాలని అభ్యర్థనం.

ఏమయినా తన తొలి కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’తో ఈ తరం పాఠకులను అలరించ వచ్చిన రచయిత్రి భావితరాలు కూడా తలుచుకునే మంచి రచయిత్రిగా మరింత ఎదగాలని శుభాకాంక్షలు.
-సుధామ


వాత్సల్య గోదావరి (కథల సంపుటి)
-మణి వడ్లమాని
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి, 2-2-185/53/3
స్ట్రీట్ నెం.13, శ్రీ దత్త హాస్పిటల్ ఎదురుగా
సోమసుందర్ నగర్, బాగ్ అంబర్‌పేట
హైదరాబాద్-13.


** *** *** ***