ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 28, 2013

వి‘చార్‌ధామ్’






‘శివుడు భక్తవరదుడు అనుకున్నాం గానీ ఇలా వరదల్లో భక్తులను ముంచుతాడనుకోలేదు. మొత్తానికి తాను లయకారుడినని నిరూపించుకుంటూ, దాదాపు పదిహేను వేల మందిని తనలో లయం చేసుకున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లినవారికి పాపం! ఇలా మృత్యువు ముంచుకురావడం, అష్టకష్టాలు పడడం అదేం భగవల్లీలనో మరి!’’ అన్నాడు శంకరం.

 ‘‘ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు. భగవంతుడు దయామయుడు కనుకనే వారి వారి కర్మపరిపాకాన్నిబట్టి చావుపుట్టుకలు ప్రసాదిస్తాడు. నిజమే! హరహర మహదేవ నినాదాలతో మారుమ్రోగే హిమగిరుల్లో ఇప్పుడు యాత్రికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. వేల సంఖ్యలో మృత కళేబరాలు కొండ దారుల్లో పడి వున్నాయిట. ఉత్తరాఖండ్‌లో వరద ఉప్పొంగి పనె్నండు రోజులైపోయింది. ఎక్కడికక్కడే మృతదేహాలు కుళ్ళి వాసనవేస్తున్నాయిట. మరోవైపు వర్షాలు కూడా పడుతూనే వున్నాయి. కేదార్‌నాథ్‌తో సహా పలు పుణ్యక్షేత్రాల్లో అంత్యక్రియలకు ఎదురుచూస్తూ అనేక శవాలు పడివున్నాయి. కేదార్‌నాథ్ బాధితులందరూ ఈసరికే తరలించబడ్డారు. కళ్ళముందే భవనం కూలిపోవడం ఉష్ణకుండం పెద్దశబ్దంతో పేలిపోవడం చూసినవారున్నారు. విరిగిపడుతున్న కొండ చరియలు, కొట్టుకు వచ్చే బండరాళ్ళు, భీకరంగా పోటెత్తే వరద ఇదంతా కళ్ళముందే యుగాంతంలా గోచరించి భీతిల్లినవారున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా వాతావరణం అనుకూలించని విషాదం వుంది. ఉత్తరాఖండ్‌లో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఎంఐ-17వి5 హెలికాప్టర్ గౌరీకుండ్‌లో కుప్పకూలింది. సహాయ కార్యక్రమాలకై వెడుతున్న ఇరవై మంది జవాన్లు దానితో మరణించారు.’’ అన్నాడు ప్రసాద్.

 ‘‘అసలు ఈ తీర్థయాత్రల పిచ్చి కూడా జనంలో తగ్గాలోయ్! ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నట్లు తీర్థయాత్రల నియంత్రణకు జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరమే! తీర్థయాత్రల నియంత్రణపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ప్రజల మనోభావాలను పరిగణనలోనికి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాలి అన్నరాయన. ఇవాళ దేశంలో తీర్థయాత్రలు కూడా పెద్ద వ్యాపారాత్మక వ్యవహారంగా మారాయి. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్ర లే కాదు, అమర్‌నాథ్ యాత్రలు కూడా అమరత్వం ప్రసాదించే దిశగా ఎప్పటినుండో ద్యోతకమవుతూనే వున్నాయి. యాత్రల పేరుతో జరుగుతున్న అసమంజస వ్యవహారాలెన్నో వున్నాయి. చార్‌ధామ్ యాత్రకు మన రాష్ట్రంనుంచి వెళ్లినవారు 2616 మంది కాగా, అందులో 933 మంది ఇంకా వెనక్కి రావల్సి వుందనీ, 430 మంది ఆచూకీ తెలియడం లేదనీ రాష్ట్ర విపత్తుల నిర్వహణా కమిషనర్ కార్యాలయం పేర్కొంది. పుణ్యతీర్థాలకు వెళ్లడం పుణ్య లోకాలకు పయనం కావడంగా మారడం విషాదమే మరి. చార్‌ధామ్ విచార్‌ధామ్‌గా మారడం విధి బలీయమనే అనుకోవాలా?’’ అన్నాడు శంకరం.

 ‘‘భగవంతుడిని నిందించే ముందు మానవ తప్పిదాల గురించి ఆలోచించకపోతే ఎలా? నిజానికి భగవానుడి ఆదేశాలను, సందేశాలను భక్తుడు తూచా తప్పక ఔదలదాలుస్తున్నాడా చెప్పు? తనకు అనుకూలంగానే అన్నీ వుండాలనీ, తేడాపాడాలు వస్తే మాత్రం ‘్భగవత్ కటాక్షం లేదని’ వాపోవడం సరికాదు మరి! మనిషికి దురాశ ఎక్కువైంది. ఇవాళ అవినీతి ఎలా అన్ని రంగాల్లో మేటలు వేసిందో చూస్తున్నాం కదా! ఉత్తరాఖండ్ వరదల్లో కూడా శవాలను దోచుకునే దృశ్యాలూ గోచరిస్తున్నాయి. వరదల్లో మానవత్వమూ కొట్టుకుపోయిందనిపించేలా శవాలపై వున్న నగలే కాదు, ఆఖరికి బెల్టులుకూడా నేపాల్‌నుంచి వచ్చిన కొందరు దోచుకోవడం జరుగుతోందట! సీతాపూర్‌లో బ్రాస్‌లెట్‌కోసం శవం చేతిని కోస్తున్న దృశ్యం ఒకటి బయటపడింది. భారీ స్థాయిలో డబ్బు, నగలు అపహరింపబడుతున్నాయి. అంతెందుకు అసలు ఉత్తరాఖండ్ ఇంతలా వరద బీభత్సానికి గురికావడానికి కారణం ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఎత్తులు వేసిన మానవ తప్పిదమేనంటే అతిశయోక్తి కాదు. వినాశనానికి హేతువు మనమే మరి. ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన అనేక నదులు ప్రవహిస్తున్నాయి. హిమానీ నదులకు ఉరవడి ఎక్కువ. ఇది జల విద్యుత్తుకు తోడ్పడుతుంది. జల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం తన ఇంధన విధానంలో భాగంగా ప్రాధాన్యం కల్పించింది. అదే అదనుగా సంపాదనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అధిక లాభాలకోసం ఉత్తరాఖండ్ పైకి దండెత్తి పుట్టగొడుగుల్లా జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాయి. 14 నదీ లోయల వెంట చిన్నా, పెద్దా కలుపుకుని ఉత్తరాఖండ్‌లో 220కి పైగా జల విద్యుత్, గనుల ప్రాజెక్టులున్నాయి. కేంద్రం అదనంగా 37 జల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అనుమతినిచ్చిందిట. 70 ప్రాజెక్టులు ప్రాథమిక దశలో వున్నాయి అక్కడ. ఈ లెక్కన ఉత్తరాఖండ్‌లో గంగ, యమునలతోబాటు ఉప నదులన్నింటినీ కలుపుకుంటే ప్రతి అయిదారు కిలోమీటర్లకు ఒక జల విద్యుత్ ప్రాజెక్టు వుందని నిపుణులంటున్నమాటే! ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అడవులు నరికివేయడం, రహదారులు పవర్‌హౌస్‌లు నిర్మించడంవల్ల దేవభూమి విపరీతమైన కోతకు గురైంది. ఉత్తరాఖండ్ అలకనంద, భాగీరథి నదుల పొడవులో 70శాతం ప్రాజెక్టులే వున్నాయి. అందువల్ల నదీ ప్రవాహం మార్పులకు గురయ్యి ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇలా మనమూ, మన ప్రభుత్వాలూ ప్రకృతి మీద చేస్తున్న దాడికి పడిన శిక్షే చార్‌ధామ్ యాత్రికులను ముంచెత్తిన వరదలు. పరమేశుని గంగకే దొంగ దెబ్బతీస్తున్న మానవ తప్పిదానికి ఈ ‘విచారధామం’ తప్పదేమో! ఇకనైనా మనిషి తననుతాను సరిదిద్దుకుని, ప్రకృతి సహజత్వాన్ని పరిరక్షిస్తే మేలు’’ అన్నాడు ప్రసాదు.




1 comments:

Anonymous said...

మీ బ్లాగును బ్లాగ్ వేదికకు అనుసంధానం చేసి విస్తృత ప్రచారం కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడగలరు.
http://blogvedika.blogspot.in/