ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 25, 2014

కవి రాజ(కీయ) విరాజితం




‘‘సినిమా అనేది అయితే దర్శకుడి చేతిలో లేదా హీరో చేతిలో వుంది. అంటే ‘అంతటా’ పెత్తనం అన్నమాట! ఎప్పటికైనా సినిమా రచయిత చేతిలోకి రావాలని శ్రీశ్రీ అభిలషించాడు. అలాగే రాజకీయాలను కూడా సృజనకారులు శాసించగల స్థితి వస్తే బాగుంటుంది కదా!’’ అన్నాడు శంకరం.

ప్రసాద్ నవ్వాడు ‘‘అవేవీ జరిగే సంగతులు కావులే! రాజకీయాల్లో మంత్రి పదవుల్లో సాహితీవేత్తలెవరున్నారు చెప్పు. ‘‘పొయట్స్ ఆర్ అన్ ఎక్నాలెడ్జ్‌డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్’’అనగా ప్రపంచంలో కవులు గుర్తింపబడని శాసనకర్తలు అన్నమాట వుంది గానీ నిజమైన శాసనకర్తల స్థానాల్లో వారు నిలవలేరనుకుంటాను. సాహితీవేత్తలు ప్రత్యక్ష రాజకీయాలలో రాణించడం కష్టమే’’ అన్నాడు.


‘‘అదేం మాట! అసలు దేశానికి తొలి ప్రధాని అయిన నెహ్రూ గొప్ప రచయిత. అలాగే పి.వి.నరసింహారావు కూడా మంచి సాహితీవేత్త. అటల్‌బిహారి వాజ్‌పేయ్ మంచి కవి. వారంతా ప్రధాని హోదాల్లోకి వెళ్ళలేదూ!’’ అన్నాడు శం కరం.


‘‘కానీ మన కవులకూ, రచయితలకూ సాహిత్య రాజకీయాలు తెలిసినంతగా ప్రత్యక్ష రాజకీయాలు తెలియవనుకుంటాను. ఎవరో వేళ్ళమీద లెక్కబెట్టగల కొందరు రాజకీయ రంగప్రవేశం చేశారేమో గానీ ఎన్నికల్లో నిలిచి గెలిచిన సాహితీవేత్తలెందరున్నారు చెప్పు. రాజ్యసభలో అడుగుపెట్టిన వారున్నారు కాదనను. సినిమా వాళ్ళతో పోలిస్తే అలా పెద్దల సభకు వెళ్ళిన సాహితీ ప్రముఖులూ తక్కువే’’ అన్నాడు ప్రసాదు.


‘‘శ్రీశ్రీ, బోయిభీమన్న లాంటి వారికి రాజకీయ రంగంతో ప్రవేశం వుండింది. ఆమాటకొస్తే అనేక మంది కవులూ, రచయితలూ వామపక్ష రాజకీయాలతో మమేకమై వున్నవారున్నారు. కాంగ్రెస్ పార్టీతో దాశరథి వంటివారు నెయ్యం నెరిపారని అనేవారూ వున్నారు. రాజకీయ స్పృహలేకుండా సాహి త్యం వుంటుందంటే నేనొప్పను’’ అన్నాడు సన్యాసి.


‘‘ఎన్నికల బరిలోకి దిగిన సాహిత్యకారులెందరన్నది కదా విషయం. రాజకీయ పార్టీ ప్రముఖులను ఇటీవలి కాలంలో వరవరరావు కలిసి, వారి మ్యానిఫెస్టోల్లో రాజకీయ ఖైదీల బేషరతు విడుదల అనేది చేర్చాలని అడిగారని ఓ వార్త వచ్చింది. అసలు ఆయనలా వారిని కలవడమే అర్థరహితం అన్నవారున్నారు. అసలు ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికనుగుణంగా లేనేలేనప్పుడు వాటిని బహిష్కరించాలని నక్సలైట్లు, వారి సానుభూతిపరులైన విరసంవారు ప్రకటించిన సందర్భాలున్నాయి. మార్పు బ్యాలెట్‌తో కాదు బుల్లెట్‌తోనే వస్తుందని సిద్ధాంతీకరించిన వారున్నారు. తాను నమ్మిన సామ్యవాద సిద్ధాంతంకొరకే శ్రీశ్రీ ఉమ్మడి మద్రాసు రాష్టప్రు అసెంబ్లీలో అప్పట్లో అడుగుపెట్టినమాట వాస్తవం. ఇవాళ రాజకీయ పార్టీలూ, వాటిని యధేచ్ఛగా మారుతూ సంచరిస్తున్న రాజకీయ నేతలను చూస్తుంటే అయోమయం మరీ ఎక్కువైపోతూ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేదే మటుమాయమైపోయిందనిపిస్తోంది. అందరూ గొప్పగా ప్రచారం చేసుకుంటారు తమతమ శక్తిమేరకు. ఎవరు సరియైన అభ్యర్థి అని ఓటరే నిర్ణయించుకోవడం ఎలా? ప్రలోభాలకు గురికాకుండా ఓటువెయ్యాలనడం బానేవుంది. కానీ ఎవడిని నమ్మి తన భవిష్యత్తును వాడి చేతిలో పెట్టవచ్చు అనే విశ్వాసం ఓటరుకి కలుగుతోంది! అందరూ దొంగలే అనీ దొంగలూ దొంగలూ ఊళ్లు పంచుకోవడమే ఎన్నికల తతంగం అనీ అనిపించే పరిస్థితులే ఉన్నాయి. ఎవరూ కాసింత నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. వాగ్దానాల వెల్లువలు- ఉచిత పంపిణీలంటూ, తొలి సంతకాలంటూ సాగుతున్నాయే గానీ అసలైన భరోసా కలగడం లేదు. ఏ అభ్యర్థీ జనంలో ‘ఇతడే మాకు కావాలి, రావాలి అనిపించేలా మెజార్టీతో కానరావడం లేదు. మోదీనో, రాహుల్‌నో భావి భారత ప్రధాని అని మోస్తున్నవారున్నారు. కానీ ఆచరణలో అంత ఉధృత జనచేతన వారి పట్ల కనిపిస్తుందన్న గ్యారంటీ మాత్రం వుండడం లేదు. సరియైన అభ్యర్థి ఎవరూ లేరని, ఎవరినీ తాను ఎన్నుకోవడంలేదని ‘నోటా’ బటన్ ద్వారా ఈసారి సూచించగల అవకాశం కూడా ఓటర్లకు వుంది. ఓటింగ్ మిషన్‌లో ఆ ‘బటన్’కూడా వుంది. నిజానికి ఈమారు దానినే ఎక్కువమంది ఓటర్లు నొక్కితే ఏంచేయాలన్న దానిమీద ఎన్నికల కమీషన్‌కే పూర్తి అవగాహన లేదు. ‘అందరూ దొంగలే’ అయినప్పుడు వున్నవారిలో కాస్త ‘తక్కువ’ దొంగ బుద్ధులవాడిని ఎన్నుకోక తప్పనిస్థితి మరి. అభ్యర్థికి సాహితీ సుగంధాలు, సృజనాత్మక రచనాపాటవాలు వుండనక్కర్లేదు కానీ, కనీసం నేరవాసనలు, హింసాత్మక ధోరణులు లేకుండా వుంటే చాలు కదా! సాహిత్యం సంగతి దేవుడెరుగు అసలు భాషను ప్రయుక్తం చేయడమో, వినియోగించడమో రాని సభ్యతాసంస్కార హీనమైన అభివ్యక్తి ప్రసంగాలలో ఆరితేరిన వక్తలను, వ్యక్తులను చూస్తున్నాంగానీ ఒక లాంగ్వేజ్ పాలసీ, సాహితీ సాంస్కృతిక పరిరక్షణా నిబద్ధత, తెలుగుకు వెలుగునివ్వగల దక్షత కానవచ్చే పార్టీలూ, అధినేతలే కానరావడం లేదు. అది కదా దౌర్భాగ్యం! కలసి వుండే- తెలుగును బ్రతికించుకోలేక, మృతభాషల జాబితాలోకి చేర్చదగిన స్థితి కల్పించినవారు రేపు జూన్ రెండు తరువాత చీలిపోయి, విడిపోయి భాషాసాహిత్యాలను ఏం ఉద్ధరించుకోగలుగుతారో అస్సలు అర్థంకావడం లేదు. రాజకీయం ఇంతటి వైక్లబ్యాన్ని తెచ్చిపెట్టగలదనుకోలేదు అని వగవడంకన్నా రేపు అధికారంలోకి రాబోయేవారు ‘రాజకీయం’ పేరుతో తెలుగు భాషాసాహిత్యాలనూ, సాంస్కృతిక మూలాలనూ, ఆత్మీయ సౌభ్రాతృత్వ భావనలను ఛిద్రం చేయకపోతే చాలు అన్నదే కోరుకోవాల్సింది. ఓటు ఏదయినా ఆ మూలాధారనాడికి పోటు పొడవకపోతే చాలు. అదే పదివేలు’’ అంటూ లేచాడు శంకరం

0 comments: