ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 13, 2014

ఎవరి ‘గోల్’వారిదే

మొదట్లో శనివారాలు,ఆ తరువాత కొన్నాళ్ళు మంగళవారాలు,ఆ పై కొన్నేళ్ళుగా శుక్రవారాల్లో దాదాపు 14 సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రిక ఎడిట్ పేజ్ మిడిల్ కాలమ్‌ గా నేను నిర్వహిస్తూ వచ్చిన 'సం.సా.రా.లు' (సంస్కృతి-సాహిత్యం-రాజకీయాలు ) కాలమ్‌ నేటితో పరిసమాప్తమవుతోంది.ఇన్నేళ్ళుగా నాచేత ఈ కాలమ్‌ రాయించిన ఆంధ్రభూమి సంపాదకులు , గౌరవనీయులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి గారికి,పత్రికా సిబ్బందికి,ఇన్నేళ్ళుగా ఆదరిస్తూ వచ్చిన అశేష పాఠకులకూ నా హృదయ పూర్వక కృతజ్నతలు,ధన్యవాదాలు .సెలవ్.



‘అన్నవస్త్రాలే తమ్ముడూ కోరుకుంటాడు.’’

‘‘అన్నన్నా! అలా అనకు! ఆ ‘ఆధార’వైఖరి నిరసించే కదా, తనది తనకు, తనదిగా కావాలని కదా ఆరాటంతో ఉద్యమించింది. ఇప్పుడంతా స్వతంత్ర ప్రతిపత్తితోనే’’.


‘‘అది అంటున్న మాటే గానీ, పోల్చుకోకుండా కుదరదు కదా! ఎందుకంటే- పేచీ పెట్టాలంటే, తనకు ఇచ్చిందల్లా నాకూ ఇవ్వాలనీ, అంతా సరిసమానంగా దక్కాలని అనడం విధిగా వుంటుంది. అర్హతలుబట్టి అవకాశాలు యోగ్యతనుబట్టి ఆధిపత్యాలు అంటే ఒప్పే పరిస్థితులు లేవు. ఒక్క చేతికి వున్న అయిదువేళ్ళే సమానంగా వుండవు కదా అంటే ఒప్పరు. ఉండి తీరాలి అంటారు.’’


సన్యాసి, శంకరం ఇలా మాట్లాడుకుంటూంటే ప్రసాదు జోక్యం చేసుకుంటూ-
‘‘తల్లితండ్రులకు తమ సంతానం ఎందరయినా వారి పట్ల ప్రేమ ఒక్కటే. అమ్మకు నాకంటే తమ్ముడే ఎక్కువ ఇష్టం అని అన్నగారో, నాన్నగారికి నేనంటే చిన్నచూపు అని తమ్ముడో కుటుంబంలో అనుకుంటూండడం మామూలే! కానీ ఏ పిల్లవాడి స్థితి ఏమిటో, ఆకలి, ఆరోగ్యం, మంచిచెడుల గురించి తల్లితండ్రులకు తెలుసు. హరాయించుకునే శక్తిలేనివాడికి ఎక్కువపెట్టి అనారోగ్యం పాలుచేయరుకదా! పాండవులు అయిదుగురిలో భీముడికి పెట్టినట్లు సహదేవుడికి కుంతి పెట్ట(లే)దు. ఎవరి శక్తిసామర్థ్యాలు, ఎవరి యోగ్యతలు వారికి వుంటాయి. అన్న అవసరాలు వేరు, తమ్ముడి అవసరాలు వేరు అయినప్పుడు ఎవరివి వారివి అవసరాలు తీర్చాలి. అన్నగారి వస్త్రాలు తమ్ముడికి సరిపోతే వాడుకోమనడంలో తప్పులేదుగానీ కొత్త బట్టలు ఎప్పుడూ అన్నకే కుట్టిస్తూ తమ్ముడికి అన్నవాడిన పాతవి అంటగట్టి సరిపుచ్చుకోమనడం సరికాదు. ఎంత ఆర్థిక పరిస్థితి అంటూ ఘోషించినా తమ్ముడికీ కొత్త బట్టలు కుట్టించి ఆ తమ్ముడి అసంతృప్తిని పోగొట్టవలసిన బాధ్యత పెద్దలకు వుంటుంది. తన బట్టలు తప్ప వేరే గతిలేదని తమ్ముడిని అన్న గేలిచేయడం సరికాదు. అన్నదమ్ములిద్దరినీ అసంతృప్తి కలగకుండా పెంచి పోషించవలసిన బాధ్యత పెద్దలదే. వారిద్దరిమధ్యా సహకారం, సమన్వయం, పరస్పర ప్రేమానురాగాలు, ఇచ్చిపుచ్చుకోవడాలూ వుండేలా చూస్తూ ఒకరు ఆత్మన్యూనతకు, మరొకరు ఆధిపత్య భవాజాలానికి లోనుగాకుండా సమన్యాయంతో ఆరోగ్యదాయకమైన అభివృద్ధి జరిగేలా చూడాలి మరి’’ అన్నాడు.


‘‘అన్న వస్త్రాలే తమ్ముడు కోరుకుంటాడు అని ఎందుకంటున్నానంటే- ప్రతిదీ అన్నతో పోల్చుకుంటూ, ‘అలాంటివే’కావాలని అడగడం వేరు. ‘అవే’కావాలనడం వేరు కదా! ఎవరెవరికి ఏమివ్వాలో వారికి ఏమి కావాలో పెద్దలకు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో ఏది మేలో కూడా తెలుసు. పోల్చుకుని పేచీ పెట్టడాలు అన్నదమ్ములిద్దరికీ సరికాదు. ఇప్పుడు రెండుగా అయిన తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంతే! వాటి అధినేతలు కేంద్రంవద్ద పెట్టే పేచీలు, ఆరాటపడే అంశాలు అలాంటివే! పోలవరం ఆర్డినెన్స్ ఒకరికి నచ్చుతుంది. ఇంకొకరికి నచ్చదు. కానీ ఎవరికి ఏది ఎందుకు మేలో కేంద్రం నిర్ణయిస్తుంది. దానికోసం ఎవ్వరు హఠం చేసినా జరగాల్సిందే జరుగుతుంది. సీమాంధ్రగా వున్న నేటి నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అరవై సంవత్సరాలకు పెంచుతూ చంద్రబాబు ప్రకటించారు. విభజన ప్రక్రియ ఇంకా సజావుగా నూరుశాతం జరగలేదు కనుక దాని అమలులో ఇబ్బందులున్నాయి. తెలంగాణా ప్రభుత్వం తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అరవైకి పెంచితే ఆ ఇబ్బందులు తొలగచ్చు. కానీ అసలు తమ వారికి ఉద్యోగాలు సరిగా దక్కడంలేదనే ఆరాటంతోనే స్వయంపాలన కోరుకున్నవారు తామూ ఆ నిర్ణయంచేసి తమ యువతలో, విద్యార్థుల్లో అసంతృప్తి జ్వాలను రేకెత్తించలేరు కదా! తెలంగాణా ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులతో సమానంగా తమ పదవీ విరమణ వయస్సునూ పెంచాలని ఆందోళన చేస్తారనుకోలేం! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇస్తామనీ, ప్రత్యేక తెలంగాణా ఇంక్రిమెంట్ ఇప్పిస్తామని చంద్రశేఖరరావు తమ ఉద్యోగులకు హామీఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు పెంచాడు కదా అని చంద్రశేఖరరావు పెంచితే పరిణామాలు వేరుగా వుంటాయి’’ అన్నాడు సన్యాసి.


‘‘అదేగా నేనంటున్నదీను! అన్నింటికీ పోల్చుకోవడాలూ, తులనాత్మకతలూ కుదరవు. సీమాంధ్రకు ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి, రాయితీలు తమకూ ఇవ్వాలనడం ఏమేరకు సమర్థనీయాలు? తెలంగాణాది లోటు బడ్జెట్ కాదు. ‘కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు’ అభివృద్ధిచెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం. దానిని కొన్నాళ్లు ఉమ్మడి రాజధాని అన్నా సీమాంధ్రులకు ఒరిగేదేమీ లేదు. వారికి ఇప్పుడు అక్కడినుండి ప్రత్యేకంగా దక్కేవేమీ లేవు. నిజానికి పునర్నిర్మాణం అన్నమాట సీమాంధ్రకే ఎక్కువ వర్తిస్తుంది. అన్నీ మొదటినుంచీ సమకూర్చుకోవలసిన అగత్యం వారిది. స్వయంపాలనతో తమ తెలంగాణాను అభివృద్ధిపథంలో నడిపించుకోవలసిన బాధ్యత వీరిది. నీళ్ళు సమానంగా కావాలంటే కొండల్లో పారే నీరుకూ చేవగల భూమిపై పారే నీరుకూ ప్రయోజనదాయకం కావడంలో తేడా లేదా? ఎక్కడ నీరు పారడంవల్ల పంటలు పండుతాయో అక్కడ నీరు పారాలి గానీ ‘సమానత’అంటూ అక్కడ తగ్గించేసి బండరాళ్ళ ప్రాంతాలలో పారించడంవల్ల ఉపయోగం వుండదు కదా! అన్న ఉద్యోగం చేసి తమ్ముడిని చదివించాలి. తమ్ముడు ఉద్యోగం వచ్చాక అన్నకు ఆసరాకావాలి. ఇద్దరూ కలిసి అమ్మానాన్నలను ప్రేమగా చూసుకోవాలి. అదీ భారతీయత, అందునా అచ్చమైన తెలుగుదనం. విడివిడిగావున్న కలివిడిగా బ్రతకాలి. సమష్టి జీవనయానం ప్రేమాభిమానాలతో సాగించాలి. అంతేగానీ అలకలు, పోట్లాటలు, మూతి ముడుచుకోవడాలు, పరస్పరం మాట్లాడుకోకపోవడాలు, రాకపోకలు పోగొట్టుకోవడాలు జరగకూడదు. అనుబంధం, ఆత్మీయత పటిష్టమయ్యేలానే, ఎవరి ‘గోల్’వారిదేగా సాగాలి’’అన్నాడు శంకరం.





0 comments: