ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, November 29, 2014

సాహిత్య ప్రజ్ఞ్ధాధురీణ



మానవీయ వాణి.. భవాని




నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా - డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, తన గ్రంథాలకు సంతరించబడిన పీఠికలతో తెచ్చిన ‘సృజనకాంతి’ ఒకటి. భవానిగారి కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవిత చరిత్ర ప్రక్రియా రచనలను వివేచిస్తూ డబ్భైమందికి పైగా వివిధ సాహితీవేత్తల రచనలు ఇందులో వున్నాయి.

పలు ప్రక్రియల్లో రచనాకృషి సల్పినా చేపట్టిన ప్రతి ప్రక్రియలో తనదైన సృజన కాంతిని వెలయించారు భవానిగారని ఇందులోని వ్యాసాలు విశదపరుస్తున్నాయి. 

దాదాపు పది కవిత్వ గ్రంథాలు వెలువరించిన భవానిగారిది తాత్త్విక సౌధం మీది కాంతిపుంజంగా మునిపల్లెరాజు, వర్తమాన దుఃఖంలో రగిలిన సంవేదన అని విహారి, సామాజిక రుగ్మతల కవిత్వీకరణ అని కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ప్రగతిశీల కవిత్వ జలపాతం భవానిదేవి అని ఎస్వీసత్యనారాయణ, స్ర్తివాద కవిత్వం లో బలమైన గొంతుక అని ఆచార్య ఎస్వీరామారావు అభినందించారు. మానవీయవాణి భవాని అని డా.ఎన్.గోపి పేర్కొన్నారు. 

గోపిగారు సృజించిన ‘నానీలు’ ప్రక్రియలో రచన చేసిన తొలి మహిళ భవానిగారే.

వివాహమా ఎంత పనిచేశావ్!
నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావ్

అన్న ఆవిడ ‘నాని’ నోచుకున్న ప్రాచుర్యం అంతాఇంతా కాదు. భవాని నానీలు, హైదరాబాద్ నానీలు ఆ ప్రక్రియను ఆమె వేగవంతం చేసిన కృషికి నిదర్శనం. 


ఇక భవానిగారి లలిత గీతాల కవిత్వం భక్తిరక్తి మాలికలంటారు శారదా అశోక్‌వర్థన్. వాటిని ఆమని ఆ ముఖంగా సంభావించారు డా.వడ్డెపల్లి కృష్ణ. భవానిది మనలను మనకు గుర్తుచేసే కవిత్వం అంటారు ఎన్‌క్యూబ్. 

అంతరంగ చిత్రాలు, అమ్మానన్ను క్షమించొద్దు, ఆవిడ కథాసంపుటాలు. ‘‘ప్రస్తుతం నెలకొన్న అనుబంధాల్లో రచయిత్రికెన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. ఈ అపశృతులన్నీ మాసిపోయి ఆరోగ్యకరమైన, ఆనందప్రదమైన, ఆదర్శప్రాయమైన సమాజం ఒకటి ఉద్భవిస్తే ఎంత బాగుండునన్నది ఆమె ఆకాంక్ష. పుట్టినప్పటినుంచీ సాహిత్యంచేస్తున్న ఆలోచన కూడా అ దే’’అంటారు మధురాంతకం రాజారాం గారు ఆవిడ కథల గురించి. ‘‘తను వ్రాస్తున్నదానిలో తనకి కల్తీలేని విశ్వాసం ఉండాలి. చమత్కారం, అతితెలివి, అనవసర భేషజం లేకుండా చేసిన రచనలివి’’అని మెచ్చారు తురగా జానకీరాణి.

సాహితీ విమర్శనాప్రక్రియలో స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత- తులనాత్మక పరిశీలన అనేది భవానిగారి గొప్ప సిద్ధాంత రచన. ‘ఆసక్తిని కలిగించే ఆమె అధ్యయనం’వారి సాహితీ విమర్శలో కానవస్తుందని డా.జి.బాలశ్రీనివాసమూర్తి అంటారు. 

రాసింది రంగస్థలానికి ‘బొబ్బిలియుద్ధం’ అనే ఒక చారిత్రక నాటకం. ఒక మహిళ అలాంటి నాటకం రాసి ప్రదర్శింపచేయడమే ఒక విశేషం! 

అలాగే బాల సాహిత్యంలోనూ ఆవిడ చేసిన అవిరళకృషిని చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, శైలజామిత్ర ప్రభృతులు ప్రశంసించారు. అలాగే, కొర్రపాటి గంగాధరరావు జీవితం-సాహిత్యం ఒక సార్థక రచనగా వెలయించారు.

ఆర్తిని స్ఫూర్తిచేసుకుని సాహిత్య దాహార్తిని కీర్తిమంతంగా మలుచుకుంటున్న ప్రజ్ఞ్ధా
ధురీణ భవాని. వారి రచనల సాహిత్య వివేచన గ్రంథాన్ని డాక్టర్ సి. ఎస్.ఆర్.మూర్తిగారు సంపాదకులుగా ముందుకు తేవడం ముదావహం.

  • -సుధామ

సృజనకాంతి
(సి. వానీదేవి సాహిత్య వివేచన)
సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి,
వెల: రూ.350/-
హిమబిందు పబ్లికేషన్స్, 102,
గగనమహల్ అపార్ట్‌మెంట్స్,
దోమల్‌గూడ, హైదరాబాద్- 29


(ఆంధ్రభూమి దినపత్రిక   అక్షర  శనివారం  29.11.2014 )


2 comments:

Unknown said...

ఆర్తిని స్ఫూర్తిచేసుకుని సాహిత్య దాహార్తిని కీర్తిమంతంగా మలుచుకుంటున్న ప్రజ్ఞ్ధాధురీణ భవానీ గారి సాహిత్య వ్యాసాల సమీక్ష చాలా బాగుంది.

సుధామ said...

ధన్యవాదాలు అనిల్ జీ!