ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, September 16, 2017

తెలుగు సమాజం -మార్క్సిజం

తెలుగు సమాజం - మార్క్సిజం
(వ్యాస స్రవంతి)
సంపాదకుడు: డా.ఎస్వీ సత్యనారాయణ
నవచేతన పబ్లిషింగ్ హౌస్
12-1-493/విఎ, గిరిప్రసాద్ భవన్
బండ్లగూడ (నాగోలు)
హైదరాబాద్-68
వెల: రూ.75/-

*
‘సమాజ రుగ్మతల కన్నింటికీ మార్క్సిజమే - మందు’ అనే భావన ప్రచులితంగానే వున్నవారున్నారు. మార్క్సిస్టు దృక్పథంతో చూసినప్పుడే, ఆ చూపునకు అది నిలిచినపుడే దేనికయినా సార్థకత! ప్రయోజనం! సంపదకు మూలం శ్రమ. శ్రమలో సమష్టి కృషిలోనే కళ ఆవిర్భావమూ జరిగిందనే మాట ఉంది. హేతువాద ధోరణిని, సాంఘిక చైతన్యాన్ని పెంపొందించి - అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకు, అభివృద్ధి నిరోధక వ్యవహారాలకు మూలమైన గ్రామాలలో, ఒక గొప్ప సాంఘిక, సాంస్కృతిక మార్పులకు మార్క్సిజం, దానిని విశ్వసించి సమాజాన్ని చైతన్యపరిచిన వ్యక్తులు కారణం కాగలిగారు కూడాను.

అసలు తెలుగు సమాజంపై మార్క్సిజం ప్రభావాలు, వైభవ ప్రాభవాలు ప్రజల ఆలోచనా ధోరణిపై దాని అనుకూల ప్రతికూల ప్రకంపనలు చర్చనీయాంశంగానే ఉంది. అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవ సందర్భంగా నేటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా.ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ వెలువరించిన వ్యాస స్రవంతి గ్రంథమే ‘తెలుగు సమాజం - మార్క్సిజం’.

ఇందులో వున్న ఎనిమిది వ్యాసాలూ అష్టదిక్కుల్లా అన్ని వైపుల నుంచీ ఆలోచనా ద్వారాలు తెరిచేవిగా ఉన్నాయి. ఈ వ్యాస రచయితల్లో ఒకరిద్దరు తప్ప నేడు మన మధ్య లేని మేధావులే. మార్క్సిజం వేకువ రేకలు గురించి రాంభట్ల కృష్ణమూర్తి తెలుగు ప్రజల సామాజిక జీవితంపై మార్క్సిజం ప్రభావం గురించి ఏటుకూరి బలరామమూర్తి, సాంస్కృతిక జీవనంపై ప్రభావం గూర్చి పరకాల పట్ట్భా రామారావు, సాంస్కృతిక రంగంపై గల ప్రభావం గూర్చి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ఆంధ్ర నాటక రంగంపై మార్క్సిజం ప్రభావం గురించి కర్నాటి లక్ష్మీనరసయ్య, ప్రజా కళారూపాలపై మార్క్సిజం ప్రభావం గురించి కందిమళ్ల ప్రతాపరెడ్డి, అలాగే ప్రధానమైన ఆధునిక తెలుగు సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం గురించి ఆర్వియార్, తెలుగు నవలపై ప్రభావం గురించి ప్రత్యేకంగా చూపు సారించి నిఖిలేశ్వర్ రాసిన వ్యాసాలున్నాయి.

ఈ వ్యాస రచయితలందరూ అభ్యుదయవాదులే. మార్క్సిస్టు మేధావులు, కవులు, కళాకారులు ఎందరో వున్నారు. సంపాదకులు ఎస్వీ అన్నట్లుగా దళిత రచయితలయిన బొజ్జా తారకం, కత్తి పద్మారావు, ఉ.సా.సాహూ, బి.ఎస్.రాములు గార్ల దళిత వాద తాత్త్విక భూమిక, అలాగే రంగనాయకమ్మ, ఓల్గా, కాత్యాయనీ విద్మహే, కాత్యాయిని వంటి సామ్యవాద స్త్రీ వాదుల  సైద్ధాంతిక పునాది మార్క్సిజమే. నిజానికి ఈ వ్యాస స్రవంతిలో అలా ఓ దళితవాద,  స్త్రీ వాద ప్రాతినిధ్య ప్రభావ వ్యాసం ఉంటే మరింతగా బాగుండేది.

‘మార్క్సిజాన్ని స్టాలినిజం రూపంలో గ్రహించినందున మృత్యునీడలాగా మార్క్సిజాన్ని స్టాలినిజం, ఆ పిమ్మట మావోయిజం వెంటాడుతూ వచ్చిన మేరకు మన అవగాహనలో ఆ విషబీజాలు నాటిన మేరకు మన ఆలోచన, ఆచరణ వక్రమార్గాన పడుతూ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రంగాలలో వ్యతిరేక ఫలితాలను కలిగిస్తూ వచ్చింది. నూతన ఆలోచనా విధానం ద్వారా మాత్రమే సృజనాత్మక మార్క్సిస్టు అవగాహన ఏర్పడి, ప్రజాతంత్ర మానవతా పూరిత శాస్త్రీయ తత్వశాస్త్రం రూపొందగలదు’ అని తన వ్యాసం ముగింపులో తీర్మానిస్తారు ఏటుకూరు బలరామమూర్తి.

‘సామ్రాజ్యవాదానికీ, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సాగిన ఈ మహత్తర విప్లవం (అక్టోబర్ విప్లవం) ప్రపంచ పీడిత ప్రజలందరికీ కనువిప్పు కలిగించింది. మార్క్సిస్టు కమ్యూనిస్టు మూలసూత్రాలు పీడిత ప్రజలను ప్రభావితం చేసాయి. ఆ విధంగా కమ్యూనిజం వ్యాప్తిలోకి వచ్చింది. ప్రపంచంలో పేద రైతు కూలీ ప్రజానీకానికి సోవియట్ రష్యా ఆశాజ్యోతిగా ప్రకాశించింది.’ అని మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తన వ్యాసారంభంలో అన్న మాట ఒకప్పటి మాట! 
సోవియట్ రష్యా ఛిద్రమవడం జరిగింది. ‘గర్జించు రష్యా! గాండ్రించు రష్యా!’ అని శ్రీశ్రీ అన్న కాలం వెళ్లేపోయింది. అయితే అక్టోబర్ విప్లవ స్ఫూర్తి అంతరించేది కాదన్నమాట వాస్తవం.

అక్టోబర్ విప్లవం గురించి తనకు జ్ఞానపీఠం సమకూర్చిన ‘విశ్వంభర’లో కీ.శే.డా.సి.నారాయణరెడ్డి ప్రస్తుతించారు. ఆ స్వప్నం చెదిరి పోతున్నప్పుడు, ఆ ఆశలు ఆవిరైపోతున్నప్పుడు, ఆ జెండా చిరిగిపోతున్నప్పుడు, ఆ తత్వం అపహాస్యం పాలవుతున్నప్పుడు సైతం ఆవేదనతో అభివ్యక్తీకరించారిలా-

ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని
ఎవ్వడురా కూసింది ఎర్రజెండా నేలకొరిగిందని
తూర్పున సూర్యుడు పొడిచినంతకాలం
మనిషిలో రక్తం ప్రవహిస్తున్నంత కాలం
అజేయం విప్లవం
అజేయం సోషలిజం
దానిని ఆపడం ఎవడబ్బ తరం??

ఏమయినా నిఖిలేశ్వర్ తన వ్యాసాంతంలో ఒకచోట పేర్కొన్నట్లు ‘గత అరవై సంవత్సరాల కాలంలో ఈ దేశంలోని వర్గ వ్యవస్థలోని కులజాఢ్యం, మత మౌఢ్యంతో బాటు  ధనిక పెట్టుబడిదారి పెత్తనాన్ని, ఆర్థిక ప్రాబల్యాన్ని ఎండగడుతూ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వర్తమాన రాజ్యం, దాని స్వభావం, ఎన్నికల జూదంలో నెగ్గుకొస్తున్న పాలకుల ఆచరణల వల్ల దుష్ఫలితాలు, కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు, యధార్థ గాథలుగా సజీవ జీవన దృశ్యాలుగా సాహిత్యంలో నవలలు వచ్చాయి. వీటిపై మార్క్సిస్టు ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది’ 

సాహిత్యంలోనూ సాంస్కృతికంగానూ మార్క్సిజం తెలుగు సమాజంతో పెనవేసుకుని వుందనే మాట యధార్థం.

-సుధామ  
       

0 comments: