ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, November 18, 2017

తెలుగు కథల్లో ఆంగ్లంపై ‘వాత్సల్యం’ ఎందుకు?



మేం గోదారోళ్లమండి’ అన్నట్లుగా, రాజమండ్రి మహిళా కళాశాలలో చదువుకున్న ‘మణి వడ్లమాని’ కౌటుంబిక జీవన స్థిరత్వం తరువాత ఓ ఏడేళ్ల క్రితమే రచనా వ్యాసంగానికి పూనినా, ఈ ఏడేళ్లలో నలభైకి పైగా కథలు రాసి, చేయి తిరిగిన రచయిత్రి స్థాయికి చేరుకున్నారు. ‘జీవితం ఓ ప్రవాహం’ అని ఓ నవల కూడా రాశారు. అంతర్జాలంలో తొలి కథ ‘కృష్ణం వందే జగద్గురుం’ కౌముది మాసపత్రికలో వెలుగు చూసింది లగాయితు, ఆవిడ కలం పరుగులెత్తింది. భర్త, పిల్లలు ప్రోత్సహించడంతో - మొదటిసారిగా ఇరవై నాలుగు కథలతో ఇప్పుడు వెలువడిన కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’.

అంతర్జాలంలోంచి అడుగుపెట్టినా, ఆపై అచ్చుగా అచ్చుపత్రికల వైపు మరలి, తెలుగు వెలుగు, స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, జాగృతి, చినుకు, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో పలు కథలు రాసి, కొన్నింటికి మంచి బహుమతులు కూడా సొంతం చేసుకున్నారు. 


సంకల్పాలు చెప్పుకుని బతికే సుబ్బుశాస్త్రి  హోరున కురిసే వాన కారణంగా ఆకలికి భార్య వర్థనమ్మతో బాటు అలమటించిన వేళ - ఆ బడుగు బాపన దంపతులను ఈశ్వర సంకల్పమే ఎలా ఆదుకుందో వివరించిన కథ సంపుటి శీర్షిక పేరిటి ‘వాత్సల్య గోదావరి’. అలాగే గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన జీళ్లు అమ్మే సూరిబాబు - జులాయితనం నుంచి మంచిని పంచే దిశగా మరలి, మానవత్వంతో పదిమందికి సాయం చేసే వానిగా ఎదిగిన కథనం ‘జీళ్ల సూరిబాబు’. మణిగారి కథల్లో ఇలా మనుషుల పట్ల సానుభూతినీ, ప్రేమనూ, కరుణనూ పరివ్యాప్తం చేసే ధోరణి పాత్రలూ, సంఘటనలూ ద్యోతకం అవుతూ, రచయిత్రి రచనా సంస్కారాన్ని చూపుతాయి. ‘మేనిక్విన్’ కథలో రాజయ్య చీరల షాపు షో కేసులో బొమ్మకు చీర కట్టేందుకు కూడా, నైతికతను ప్రదర్శించడం - ఉదాత్త విలువల పట్ల దృష్టిని ఉన్నతీకరించడమే! బొమ్మలోనైనా సరే స్త్రీల  మాన మర్యాదలకు విలువనివ్వడం నిజంగా విశేషం!

తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీరైనా తండ్రి టైలరింగ్ షాపులో పనిచేసేవారి ఉపాథి పోకూడదని, ఆ వృత్తిని కొనసాగించిన యువకుడు సునీల్ కథనం - ‘రెయిన్‌బో టైలర్స్’. వృద్ధులకు, అందునా మంచం పట్టిన వారికి అహరహం సేవలు చేయడం కష్టతరమైన అంశమే! కానీ నిస్సహాయ స్థితిలోని పెద్దావిడకి హృదయవాసిగా మారిన శోభ ఆదర్శనీయమైన సేవాతత్పరతా కథ ‘అనుబంధం’. వలసలు ఎక్కువైన నేటి కాలాన - మూలాలు వెదుక్కుంటూ, తాత అభీష్టం తీర్చడం కోసం స్వదేశానికి వచ్చి, అనుబంధాలు నిలుపుకునే వారధిగా మారిన ‘సోహం’ కథ కదిలిస్తుంది. పది మందికి ఉపయోగపడితేనే సంపాదించిన డబ్బుకి విలువ అని వేరుశనక్కాయలమ్ముకునే కుర్రాడి ద్వారా స్ఫూర్తి కలగడం - ‘అన్వేషి ’ కథలో చూస్తాం. అలాగే ‘కుటుంబ భారతం’, ‘సౌగంధికా లావణ్యం’ వంటి కథలలో చక్కని సంవిధానం చూపారు రచయిత్రి. 


అయితే ఒక్క విషయం-

మొబైల్ రింగ్ అవుతోంది. టీవీ చూస్తున్న చైతాలీ సౌండ్ తగ్గించి ఎవరి దగ్గర నుంచా అని చూసింది. అది సీమా నుండి వచ్చింది. వెంటనే ఆన్సర్ బటన్ ప్రెస్ చేసి ‘హాయ్ సీమా! గుడ్‌మార్నింగ్. పొద్దున్నేకాల్ చేసావు? ఏంటి విశేషం?’ అంది.


అవతల నుంచి సీమ ‘అరె చైతూ! అదే.. ఇవాళ మనకు లంచ్ పార్టీ ఉంది మర్చిపోలేదు కదా? అదీకాక డ్రెస్‌కోడ్ మారింది. అది చెబుదామని కాల్ చేశాను. నేను పెట్టిన మెసేజెస్ ఏవీ చూడలేదని అర్థమయ్యింది. మనం ముందు అనుకున్న యెల్లో బదులు లెమెన్ యెల్లో కలర్ శారీస్ కట్టుకుందామని డిసైడ్ అయ్యాము.’


కథారచన ఇలా - నేటి తరం ఇలానే మాట్లాడుతోంది కదా అని సమర్థించుకుందామన్నా, ఒక వాక్యంలో అన్నేసి  ఆంగ్ల పదాలతో రాయడం అనే ధోరణి ప్రశంసనీయం కాదు. ఇప్పటికే తెలుగు చచ్చిపోతోందన్న ఆర్తి ప్రబలుతున్నప్పుడు నిజానికి భాషను పరిరక్షించవలసిన కర్తవ్యం సాహిత్యకారుల మీద ఉంది. తెలుగు కథను తెలుగుతనంతో పరిపుష్టం చేయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది. పాత్రోచిత సంభాషణలు అనే మిష మీదనయినా ఆంగ్ల పద ప్రయోగం కొంత అర్థం చేసుకోవచ్చు గానీ, రచయిత్రే కథాసంవిధానంలో ఆంగ్ల పద ప్రయోగాల మోజులో పడకుండా ఉండడం అవసరం. 


మణి వడ్లమాని అన్ని కథలలో ఈ అనౌచిత్యానికి పాల్పడ్డారనడం లేదు గానీ, తెలుగు భాషకు, సంభాషణల్లో తెలుగు తనానికి మరింత ప్రాధాన్యం కల్పించి, తన కథల ద్వారా మానవీయ విలువలకూ, ఉదాత్త పాత్రలకూ, స్ఫూర్తిదాయక సంఘటనలకే కాక చక్కని తెలుగు నుడికారానికి, తెలుగు వాక్య నిర్మాణానికీ కూడా తోడ్పడాలని అభ్యర్థనం.

ఏమయినా తన తొలి కథాసంపుటి ‘వాత్సల్య గోదావరి’తో ఈ తరం పాఠకులను అలరించ వచ్చిన రచయిత్రి భావితరాలు కూడా తలుచుకునే మంచి రచయిత్రిగా మరింత ఎదగాలని శుభాకాంక్షలు.
-సుధామ


వాత్సల్య గోదావరి (కథల సంపుటి)
-మణి వడ్లమాని
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి, 2-2-185/53/3
స్ట్రీట్ నెం.13, శ్రీ దత్త హాస్పిటల్ ఎదురుగా
సోమసుందర్ నగర్, బాగ్ అంబర్‌పేట
హైదరాబాద్-13.


** *** *** ***




0 comments: