ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 9, 2017

పదునైన వ్యంగ్య రచనలో రారాజు






కీ.శే.కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి అంటే ఎవరో అనుకోవచ్చు. కానీ పతంజలి అనగానే తెలుగు సాహిత్య లోకం కె.ఎన్.వై.పతంజలి అని సులభంగానే గుర్తిస్తుంది. ఎందుకంటే రాచపుట్టుక పుట్టిన ఆయన రచయితగా బడుగు ప్రజల పక్షం వహించి ‘రాజ్యం’లోని దుర్మార్గాలపై వ్యంగ్యపు పదునుతో కలాన్నే కత్తిచేసి దునుమాడినవాడు. 

నేటి విజయనగరం జిల్లాలో విలీనమైన నాటి విశాఖ జిల్లాలోని అలమండ గ్రామం ఆయన పుట్టిన ఊరు. 29 మార్చి 1952లో జన్మించి ఆ జనపదం నుంచే జ్ఞానపథం వైపు మరలాడు. ఆరు వందల సంవత్సరాల ఆలమండ అణువణువునూ తన పరిశీలనతో భద్రపరచుకున్న ఆయన బుద్ధి, హృదయం అందుకే తన రచనల్లో ప్రభావోపేతంగా ప్రతిఫలించాయి. చోడవరం, కొత్తవలసలలో విద్యాభ్యాసం చేసి, చిన్ననాటనే అపరాధ పరిశోధక నవలలు, ఇంట్లో వున్న ఇతరేతర పుస్తకాలు, ఆంధ్ర పత్రికలు చదివి నిరంతర పాఠకుడయ్యాడు. ఆ దశలోనే అన్నయ్య దగ్గర శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం, బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి అక్కడ చలం ‘స్ర్తి’ చదవడం పతంజలిలో మార్పునకు మూలధాతువులయ్యాయి. 

విజయనగరంలో డిగ్రీ చదువుతున్నప్పుడే అద్దె గదిలో పతంజలి అక్షర యాగానికి అంకురార్పణమైంది. పదకొండేళ్ల ప్రాయంలో రాసిన ‘అస్థిపంజరం’ డిటెక్టివ్ నవల అలా వుంచితే 1963 నుండి ఓ పుష్కర కాలం పొందిన అనుభవంతో, సామాజిక అవగాహనతో 1968లో ‘చివరి రాత్రి’ అనే కథానికతో మొదలుపెట్టి పలు కథలు రాశారు. చలంలా రావిశాస్ర్తీలా రాయడమనే ప్రేరణ ఆ దశలోనిది. విశాఖపట్టణంలో ఈనాడు దినపత్రికలో 1975లో ఉపసంపాదకునిగా చేరడంతో తన జర్నలిస్టు వృత్తి జీవితం మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం తనలోని జ్ఞానాగ్నిని రగుల్కొల్పింది. ప్రాచ్య పాశ్చాత్య రచయితలను, వారి సాహిత్యాన్ని అవలోకనం చేశాడు. జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాలతో పెనవేసుకున్న ఆత్మిక భావన పతంజలిని విశ్వ మానవ సౌభ్రాతృత్వం వైపు మరల్చింది. తన ‘వీరబొబ్బిలి’ నవలను ‘డాగిష్ డాబ్లర్’గా తానే ఆంగ్లంలో అనువదించుకునేంత ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో మన్ననలు పొందగలిగాడాయన.

పతంజలి రచనలన్నీ త్రికరణ శుద్ధితో వెలువడినవే. మాటకు, రాతకు, చేతకు పొంతనలేని రచయితల కోవకు ఆయన చెందడు. మాట పడడం నచ్చనివాడు. తన రచనలు ప్రమోట్ చేసుకోవడం, పురస్కారాల వెంపర్లాట ఏ కోశానా లేనివాడు. మనుషులను ప్రేమించినవాడు. పత్రికా ప్రపంచంలో నిజాయితీ గల జర్నలిస్టు ఇమడగలగడం ఎంత కష్టమో తానెదుర్కొన్న ఇబ్బందులతో స్వయంగా గ్రహించిన వాడాయన. ‘పతంజలి పత్రిక’ అని విశాఖలో సొంతంగా దినపత్రిక పెట్టి చేతులు కాల్చుకున్నాడు కూడాను. ఆ తర్వాత వృత్తిపరంగా పతంజలి రూపెత్తిన సరికొత్త కేశ తైలాన్ని కనుగునే ఆయుర్వేద వైద్య ఫణితి, నిల్వ పచ్చళ్ల తయారీకి దిగి శ్రమ జీవనానికి ఆహ్వానం పలకడం కొందరికి అచ్చెరువును కలిగించాయి కూడాను. తండ్రి నుంచి ఆయుర్వేద వైద్యాన్ని వారసత్వంగా అందుకుని బతుకుతెరువు గడుపుకున్నాడు. 57 ఏళ్ల వయసులో 2009లో తనువు చాలించాడు.

పేరు కోసం కాక, తన రచనా ప్రవృత్తిని వ్యవస్థలోని చెడునీ దుర్మార్గాన్నీ వెక్కిరిస్తూ ప్రశ్నిస్తూ సాగించాడు. అన్యాయాన్ని రచ్చకీడ్చడమే తనకానందం. అందుకే పతంజలి కలం పదునైన వ్యంగ్యానికి ప్రతీకగా మారింది. ధర్మాగ్రహం, బాధలకు ప్రతిస్పందన తన వ్యంగ్యం. ‘అస్త్రాలు అనేవి ఉంటే పాశుపతాస్త్రం తీవ్రాతి తీవ్రం అని నేను విన్నాను. దానికన్నా తీవ్రమైన అస్త్రం వెక్కిరింత. అది నా జిల్లాలో, నా కుటుంబంలో చాలా ఎక్కువ బహుశా అది నా రక్తగతం’ అని స్వయంగా ప్రకటించుకున్న పతంజలి వైయక్తిక సంభాషణలు కూడా హాస్యస్ఫోరకంగా ఉండేవి. సునిశిత వాదన వ్యంగ్య వాగ్ధార తనది. లోకానుభవం మూలకందం. 

దిక్కుమాలిన కాలేజీ (1976), చూపున్న పాట (1998), అదర్రా బంటి (1984 ఉదయం పత్రిక సీరియల్. ప్రచురణ 2005), కథా సంపుటాలు, ఖాకీవనం, రాజుగోరు.. వారి వీర బొబ్బిలి, పెంపుడు జంతువులు, అప్పన్న సర్దార్, ఒక దెయ్యం ఆత్మకథ, గోపాత్రుడు, పిలక తిరుగుడుపువ్వు, నువ్వే కాదు లేదా మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు వంటి నవలలు నవలికలు 1970 లగాయితు ఓ మూడు దశాబ్దాలపాటు పాఠకులను పతంజలి విలక్షణ శైలితో విశేషంగా అలరించాయి. 1984 నుండి 1986 వరకు ‘ఉదయం’ దినపత్రికలో తాను కాలమ్‌గా రాసిన వ్యాసాల సంకలనం ‘పతంజలి భాష్యం’ (1989) అతని ఉన్నత శ్రేణి ఉదాత్త భావజాలాన్ని పరివ్యాప్తం చేసింది. ‘రచయిత కాలేని వాడు మంచి పాత్రికేయుడు కాలేడు. శ్రీశ్రీ, గోరాశాస్త్రి  మంచి రచయితలు, మంచి పాత్రికేయులు అయ్యారు’ అన్న పతంజలి తానూ ఏ పత్రికలో వున్నా తను రాసే సంపాదకీయాలతో ప్రజాదరణ పొందాడు. తెలుగు నాటక రంగం గురించిన ఓ సంపాదకీయంలో ‘ఒకే ఒక్క గొప్ప నాటకంతో బతికేస్తున్న జాతి బహుశా ఇదొక్కటే’ అంటూ కన్యాశుల్కం తరువాత జన జీవితంలో భాగమై ప్రభావం వేయగల నాటకం మరొకటి రాకపోవడాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు.

పతంజలి రచనల్లో స్త్రీపాత్రల ప్రాముఖ్యత ఎందుకో తక్కువే! అయితే ఆయన ఇతివృత్తాల, రచనా సంవిధానాల పరిధిలోనే ఆ పాత్రలున్నాయి. స్ర్తివాదం మీద సానుకూల దృక్పథం గల పతంజలి ‘స్త్రీల బాధలు రచనల్లో ప్రతిఫలించాలి. స్త్రీలే ఆ విషయాలు మాట్లాడాలిస్త్రీలు మాత్రమే అవి రాయాలి’ అని స్త్రీవాదం ప్రబలంగా రావాలనే అభిలషించారు. తాను రాసిన కవిత్వం మాత్రం తక్కువే! 

వచన రచయితగానే పతంజలిది పదునైన కలం. రాయడం గొప్పతనంగా కాక బాధ్యతగా రాసిన రచయిత పతంజలి. రష్యన్ వచన మహా రచయితల్ని అతను జీర్ణం చేసుకున్నట్లుగా మరెవరూ చేసుకోలేదేమోనన్న కె.శివారెడ్డి మాట సత్యదూరం కాదు. పత్రికా రచనలో తెగువ, మెలకువ కలిగి కథా రచన నుండి నవలా రచయితగా పరిపక్వమైన ప్రతిభామతి కె.ఎన్.వై.పతంజలి గురించి కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ సాహిత్య నిర్మాతలు పరంపరతో గ్రంథాన్ని వెలువరింపజేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం. ఉత్తరాంధ్ర జీవద్భాషతో తెలుగు కథా రచన చేస్తూ, వికర్ణ అదిగో ద్వారక వంటి పురాణ పునర్మూల్యాంకన రచనలతో సమాజాన్ని వివేచింపజేస్తూ వున్న ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు గారి చేత ఈ ‘మోనోగ్రాఫ్’ రాయించడం ఎంతో ఔచితీమంతంగా ఉంది. పతంజలి వ్యక్తిత్వ, సాహిత్య విరాడ్రూపానికి చక్కటి ఫ్రేమ్ కట్టి అందించిన చిత్తరువు ఈ గ్రంథం.
-సుధామ


కె.ఎన్.వై.పతంజలి
-చింతకింది శ్రీనివాసరావు
సాహిత్య అకాడెమీ ప్రచురణ
ప్రధాన కార్యాలయం, రవీంద్రభవన్ 35, ఫిరోజ్‌షా రోడ్ న్యూఢిల్లీ - 110 001
వెల: రూ.50
** ** ** ** ** ** ******



ఆంధ్రభూమి *దినపత్రిక*అక్షర*శనివారం*9.12.2017



0 comments: